దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లి, తండ్రి పడే వేదనఇది. వారికేం తక్కువ చేసాం?? అన్నీ సమకూర్చాం కదా..!! అని మీరు అనుకోవచ్చు.. వృద్దాప్యంలో వారికి కావాల్సింది ఒక్కటే కాసింత అనురాగం, ఆప్యాయత, మాటా మంచి పంచుకునే మీరు, అల్లర్లు చేస్తూ ఆడుకునే మనవళ్ళు, మనమరాళ్ళు.. మూడు పూటలా తిండి లేకున్నా ఉండగలరు కానీ, మూడు రోజులకు ఒక్కసారి కూడా మీతో మాట్లాడకుంటే ఉండలేరు.. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ.. /\
అవునలాగే ఉంటాయ్ పరిస్థితులు..!!
నువ్వూ, నేను అంటే లెక్కుండదు ... !!
మనమెక్కి తొక్కిన మంచాలూ,
చూసి చూసి విసుగెత్తిన దూరదర్శన దుర్భిణీ యంత్రాలూ,
నమిలి నమిలి వదిలిన పట్టు వస్త్రాలూ, పసిడి కాంతులూ
రాసి పారేసిన ఆత్మకథా సరిత్సాగరాలూ,
వాసన చూసి విసిరేసిన మల్లెపూలూ,
మదన కామరాజు కథలూ కావాలి వాళ్ళకి.. !
నువ్వూ, నేను లెక్కుండదు.. !!
మనం సరిగ్గా గాలి పీలుస్తున్నామా ??
మనం ఒక్కపూటైనా భోజనం చేస్తున్నామా ??
నిత్య యుద్దాల మధ్య కల్లోలితమౌతున్న మన మనసులు
సేద తీరుతున్నాయా ?? లేదా ఇవేమీ
వాళ్ళెవ్వరికీ పట్టవు.. !!
మన చీము, నెత్తురు పరీక్ష చేస్తారే తప్ప
మన అంతరంగాల్ని స్పృశించే ప్రయత్నం ఏనాడు చెయ్యరు..!!
అవునలాగే ఉంటాయ్ మరి పరిస్థితులు...
వెదజల్లే విచిత్ర భాస్వరాలు
నీ స్వార్ధం నీది,
నా స్వార్ధం నాదంటుందీ ప్రపంచం బ్రతికినన్నాళ్ళూ
నువ్వూ, నేను అంటే లెక్కే ఉండదు ... !!
చనిపోయాక మాత్రం పెద్ద పెద్ద గోరీలు కడతారు
నడిబజార్లో కాంస్యవిగ్రహాల్ని నిలబెడతారు..
పత్రికల్లో సంవత్సరీకాలు ప్రచురిస్తారు
రాబోయే మరణానంతర భోగాలను ఊహించుకుంటూ
ప్రస్తుతం మనం వాళ్ళను క్షమించాల్సిందే..
సంధ్యలో బీభత్సాన్ని ఆనందంగా అవలోకించాల్సిందే ..
బ్రతికినన్నాళ్ళూ మనం ప్రతీ జీవపదార్ధాన్ని క్షమించాల్సిందే ..
ఘాడంగా ప్రేమించాల్సిందే.. !!
మారని రాతలు వారివి.. !!
మార్పులేని బ్రతుకులు మనవి..!!
Comments
Post a Comment