పైసా ఖర్చుపెట్టకుండా ఇతరులకు మనం ఇవ్వగలిగే గిఫ్ట్ ఏదైనా ఉంటుందీ అంటే… అది Respect.. డబుల్ మీనింగులు లేని స్వచ్ఛమైన స్మైల్…
మనకు బాగా తెలుసు, ఎవరి లోపాలేంటో పనులు మానుకుని మరీ స్టడీ చేసుకుంటూ ఉంటాం. ప్రతీ మనిషినీ పూచికపుల్లలా తీసిపారేయడానికి మన దగ్గర సవాలక్ష కారణాలు సిద్ధంగా ఉంటాయి.
కళ్లెదురు ఏ మనిషి కన్పించినా పైకి వచ్చే expressions వేరు.. లోపల మనకు మనం అనుకునే అంతర్గత సంభాషణలు వేరు..
లైఫ్‌లోకి తారసపడిన ప్రతీ ఒక్కర్నీ కొన్నాళ్లపాటు విపరీతంగా అభిమానించేసి.. కొత్తదనం పోగానే, సహజసిద్ధమైన మానసిక లోపాలు కన్పించగానే జీవితాంతం దూరం పెట్టేయడం మనకు సరదా.
ఓ మాటలో చెప్పాలంటే మనకు ఒళ్లంతా పొగరు.. “పోతే పోనీయ్… ఆ మనిషి కాకపోతే బోలెడు మంది మనుషులు దొరుకుతారు” అని ఈసడించిపారేస్తాం.
——————–
నిజమే.. కోట్ల కొద్దీ జనాభా ఉన్న ప్రపంచంలో రోజుకి కొన్ని వందల మందిని కొత్త వాళ్లని చూసుకోవచ్చు. అలాగే కన్పించిన ప్రతీ మనిషినీ పైకీ.. క్రిందికీ ఆపాదమస్తకం చూసేసి… “నాకీ మనిషి నచ్చలేదు ఎందుకో” అని పెదవి విరిచేయనూ వచ్చు. అంతేకాదు.. అతవలి మనిషి ఏంటో, ఆ మనిషి గొప్పదనం ఏంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండానే అవమానకరంగా మాట్లాడనూవచ్చు.
బట్ మనుషులకు విలువ ఇవ్వని ఏ మనిషికీ జీవితం లేనట్లే! అలాంటి మనుషులు చాలా దారుణమైన లైఫ్ లీడ్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ విషయం కాలక్రమేణా లైఫ్ ముందుకు సాగుతుండే కొద్దీ గానీ అర్థం కాదు. అప్పటికే నోటి దురుసుతో, లెక్కలేనితనంతో కన్పించిన ప్రతీ వాళ్లనీ దూరం చేసుకుంటారు, ఆల్రెడీ కాస్తో కూస్తో మంచిగా ఉన్న వాళ్లనీ నెట్టి పారేస్తారు.
——————-
మనుషుల్ని అన్‌కండిషనల్‌గా ప్రేమించాలి… చాలామంది తరచూ కంప్లయింట్ చేస్తుంటారు… అంతా అవకాశవాదులే కన్పిస్తున్నారు.. అవసరానికే ఫోన్లు చేస్తున్నారు.. హెల్ప్ చేయించుకుంటున్నారు అని!!
పనుల కోసం కాకపోతే మీతో కూర్చుని.. “ముస్తాఫా ముస్తాఫా… డోంట్ వర్రీ ముస్తాఫా” అంటూ పాటలు పాడుకునే తీరిక ఎవరికుంది? అసలు మీరు ఇతరులకు ఏయే సందర్భాల్లో కాల్ చేస్తున్నారో ఓసారి రీకాల్ చేసుకోండి.. అందరూ అంతే! లైఫ్ ఫాస్ట్ అయిపోయింది.. అవసరాలే మనుషుల్ని కలిపి ఉంచుతున్నాయి.. ఒక మనిషితో మరో మనిషికి ఏదో రకమైన అవసరం లేకపోతే అసలు ఒకర్నొకరు లెక్కచెయ్యలేనంత ఏటిట్యూడ్‌లు కూడా తలకెక్కాయి. సో అవసరాలకు వాడుకుంటున్నారని నిందించకండి…
చేతనైన సాయం చెయ్యడం, చేతకాని సాయాలను నిర్మొహమాటంగా చెప్పేయడం, అవసరమైనప్పుడు సాయం తీసుకోవడం.. అన్నింటికన్నా ముఖ్యంగా హృదయంలో స్వచ్ఛంగా, అవతలి మనిషి పట్ల ప్రేమగా ఉండడం, ఏదో మైండ్‌లో పెట్టుకుని ఏదోలా స్టుపిడ్‌గా ప్రవర్తించకుండా ఉండడం.. ఈ కొన్ని క్వాలిటీస్ చాలు అందరం హాపీగా ఉండడానికి!
లేదంటే మనుషులందరూ చాలా చెడ్డవాళ్లగానే కన్పిస్తారు.. ప్రతీ మనిషీ శత్రువుగానో, వేస్ట్ ఫెలోగానో అన్పిస్తారు.. అసలు విషయం ఏమిటంటే ఇలాంటి అద్భుతమైన మనుషుల మధ్య మన మనస్సు కలుపు మొక్కగా తయారవుతోందని! తప్పు ఎవరిదో కాదు, మన ఆలోచనా విధానానిది! సో మనుషుల్ని గౌరవిద్దాం, ప్రేమగా మసలుకుందాం!!
Comments
Post a Comment