జీవితంలో కొందరికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. చాలాసార్లు సవాళ్లను ఎదుర్కోలేక ఓడిపోయి అన్యమనస్కంగా జీవిస్తుంటారు. మనసులో ధైర్యం ఉండదు. దేహంలో శక్తి తగ్గినట్లు నీరసపడి పోతారు.
ఓటమి నుంచి జయానికి దారి చూపేదే ఆశ. చీకటి నుంచి వెలుగులోకి రావాలంటే నమ్మకం, విశ్వాసం, సంకల్పం ఉండాలి. వీటికోసం వెతకాలి. మనిషన్నాక వ్యాధులు రావచ్చు. ఆర్థిక సమస్యలు సతమతం చేయవచ్చు. సమాజంలో గౌరవ భంగం కలగవచ్చు. కొన్నిసార్లు బతుకులో చీకటి కోణాలు భయానికి కారణమవుతాయి. ఈ చీకట్లను చూసి అంధత్వం కొనితెచ్చుకోకూడదు. ఇక నావల్ల కాదు, నా పరిధిలో లేదు అని వ్యాకులతకు గురికావడం సాధకుడి బలహీనతే!
సాఫల్యం, విజయం గురించిన ఆలోచనలే మనసులో కదలాడుతూ ఉండాలి. నిరాశావాది ఏదీ సాధించలేడు సరికదా...ఇతరులను సైతం నిరాశకు గురిచేస్తాడు. సమస్యలను, కష్టనష్టాలను పరిశీలించాలి. ప్రశ్నించుకొంటే సమాధానం లభిస్తుంది. ఎందుకంటే, ప్రతి ప్రశ్నకూ సమాధానం ఉంటుంది. జీవితమే సమస్యల సమాహారం. మనిషి బతుకు వడ్డించిన విస్తరి కాదు.
మనిషి జీవితమే బాధలమయం. అతడి సమస్యలకు పరిష్కారం ఏమిటన్నది ప్రశ్న. పిప్పలాదుడు ఈ ప్రశ్నకు బదులిస్తూ- మనిషి సాధనకు సహాయపడటానికి పంచేంద్రియాలు, కాళ్ళూచేతులు, శక్తిని ప్రకృతి ఇచ్చింది. వీటి సహాయంతో మానవుడు పరిష్కరించుకోలేని సమస్యే లేదు. మనకు ఇన్ని వనరులున్నా ఎవరో వచ్చి ఏదో చేసి కష్టాలనుంచి గట్టెక్కిస్తారనుకోవడం సరైనది కాదు. భగవద్గీతలో అర్జునుణ్ని విషాదయోగం నుంచి శ్రీకృష్ణుడు స్పష్టమైన, సూటి మాటలతో వెలుపలికి తీసుకొచ్చి కర్తవ్య సాధనకు సన్నద్ధం చేశాడు. అజ్ఞానమనే చీకట్లను దూరం చేసి తేజోవంతుణ్ని చేశాడు. చివరకు విజయం పాండవులనే వరించింది. నిస్పృహతో ధనుర్బాణాలు కింద పడేసిన అర్జునుడే కడకు విజయుడయ్యాడు.
జ్ఞానం, ధైర్యం ఉన్నచోట అపజయం ఉండదు. మనిషి జీవితం చీకట్లో మగ్గుతోందంటే మనసులో ఆశల వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నించాలి. జీవితాన్ని కాంతిమయం చేసుకోవాలి. మనిషి మౌలికంగా ఆశాజీవి. మనమే వెలుగు. మన ఆత్మ గొప్ప జ్యోతి. ప్రకృతితో మనిషి మమేకం కాగలిగితే కాంతి అతణ్ని అంటిపెట్టుకునే ఉంటుంది. చీకటి మనిషి దరి చేరదు. చీకటి లేని జీవితంలో అంతా మంచే. ప్రతి మనిషి ఆత్మలో వెలుగు పుంజాలు ఉంటాయి. మనం భౌతిక ప్రపంచంలోని చీకట్లను, భ్రమలను విడిచి ఆత్మావలోకనం చేసుకొంటే వెలుగులు జీవితంలోకి విరజిమ్ముతాయి. ఆలోచన, మననం సాధన చేయగలిగితే మన కంటికి ఆ వెలుగు రేఖలు ప్రస్ఫుటమవుతాయి. అవమానం, అప్రతిష్ఠ, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులన్నీ చీకటి కోణాలే! జీవితంలో ఇవన్నీ ఆకాశంలో సాగిపోతున్న మేఘాల్లాంటివే. అవి తొలగిపోయాయా... అంతా వెలుగే! చీకటి వెనకే వెలుగు వస్తుంది. కాళరాత్రి గడిచి వేకువ అయ్యిందంటే వెలుగు కిరణాలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. కాంతి శాశ్వతమైంది. అంధకారం అనిత్యమైంది. సూర్యుణ్ని మేఘం కమ్ముకున్నంత మాత్రాన వెలుగు జాలువారక మానదు. కష్టాలు కలకాలం నిలువవని అంటారు. అన్వేషణ, నేర్పు వికసించగానే ఆనందం, సుఖం అందివస్తాయి. ఈ సత్యం తెలుసుకొంటే చాలు... బతుకు బాట వెలుగుల తోట!
Comments
Post a Comment