అర్ధరాత్రి...
సమయం ఒకటిన్నర అవుతోంది
ఫోన్ రింగవుతోంటే చిరాకుగా లేచి లిఫ్ట్ చేశాడు-
"పుట్టినరోజు శుభాకాంక్షలురా కన్నా" అని అమ్మ శుభాకాంక్షలు తెలియజేసింది
"రేపు ఉదయాన్నే చేయచ్చు కదా, ఈ టైమ్ లో చేసి మంచి నిద్ర పాడుచేసావ్ అనవసరంగా" అని విసుక్కుని ఫోన్ పెట్టేసాడు...
కాసేపటికి మళ్లీ ఫోన్ వచ్చింది
నంబర్ చూశాడు, నాన్నది...
"పొద్దున్నే చేయచ్చు కదా నాన్నా" ఈసారి కొడుకు గొంతులో కోపం లేదు...
"నేను నీకు ఫోన్ చేసింది నీకు శుభాకాంక్షలు చెప్పడానికి కాదు-
మీ అమ్మ పిచ్చిదిరా... అందుకనే ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసి నిన్ను ఇబ్బంది పెడుతోంది
తను ఈరోజు కాదు, పాతికేళ్ల క్రితమే పిచ్చిదైపోయింది నీకు జన్మనివ్వడానికి
తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసీ కూడా
డాక్టర్ ఎంత చెబుతున్నా ఆపరేషన్ చేయించుకోకుండా, సాయంత్రం ఆరుగంటల నుండీ ఒంటిగంటన్నర వరకూ ప్రసవవేదనను అనుభవించి నీకు ప్రాణం పోసింది
పిచ్చిది కాక మరేంటి
గత పాతికేళ్లుగా ప్రతీ రోజు రాత్రి ఒంటిగంటన్నరకు నన్ను లేపి 'మన కన్నయ్య పుట్టింది సరిగ్గా ఇప్పుడే కదాండీ' అంటూ గుర్తుచేస్తూంటుంది
సంవత్సరంలో ఒక్క రోజు నిద్ర లేపితే
నిద్ర పాడైపోయిందని విసుక్కుంటున్నావా అటువంటి తల్లిని "అని చెప్పి ఫోన్ పెట్టేసాడు...
ఉదయాన్నే అమ్మ ఇంటికి వెళ్లి అమ్మ కాళ్లను పట్టుకుని" నన్ను క్షమించమ్మా... తప్పైపోయింది "అని ప్రాధేయపడ్డాడు కొడుకు
తండ్రి -" ఇన్నాళ్లూ... నాకేమన్నా అయితే నా కన్నయ్య ఉన్నాడు అని చెప్పుకునేది, కానీ మాకా అవసరం లేదు
ఇన్ని రోజులు చూసుకున్నట్టే ఇకమీదట కూడా మీ అమ్మను జాగ్రత్తగా నేనే చూసుకోగలను
నువ్వెళ్లి నీ సంసారం చూసుకో "అని కోపంగా చెప్పాడు
దానికి అమ్మ -" ఎందుకండీ అంత కోపం... మన కన్నయ్యే కదా, పైగా పుట్టినరోజు పూట "అంది కొడుకు తలను నిమురుతూ...
అందరికీ తెలిసినదే...
" ఈ సృష్టిలో మనం ఎన్ని మాటలన్నా, ఎంత బాధపెట్టినా కూడా, మనసులో పెట్టుకోకుండా ప్రేమగా బుగ్గలు నిమిరేది అమ్మ మాత్రమే" అని...
బహుశా అందుకనే ముందుగా
'మాతృదేవోభవ' అన్నారు పెద్దలు...
మాతృమూర్తులందరికీ మనస్ఫూర్థిగా వందనాలు💕🙏
Comments
Post a Comment