జీవితం మొత్తం కొన్ని లైన్లలో!
-------------------------
అపర శక్తివంతుడిగానూ ఉండు.. అత్యంత బలహీనుడిగానూ ఉండు..
సకల జ్ఞాన సంపన్నుడిగా ఉండు.. జ్ఞానమనేదే లేని మూర్ఖుడిగానూ ఉండు..
దైవంగా ఇతరుల గుండెల్లో కొలువై ఉండు.. కొన్నిసార్లు దెయ్యంగానూ మారిపో..
మానవత్వానికి ప్రతిరూపమవ్వు.. బండరాయిగానూ క్షణాల్లో మారిపో..
ఎంత ప్రేమిస్తావో అంతే అందుకు భిన్నంగానూ మారిపో..
తీయటి మాటలే కాదు.. కటుత్వానికి కేరాఫ్ అడ్రస్‌గానూ కన్పిస్తుండు..
నిన్ను మంచోడు అన్నోళ్లే ఇంకో క్షణంలో చెడ్డోడూ అనేస్తారు.. ఇదంత మామూలే..
అమాయకుడిగానూ ఉండు.. మాయలు చేసే మాయకుడిగానూ అవతారమెత్తు..
నిజాలు లేవు, అబద్ధాలు లేవు, సత్యాలు లేవు, అసత్యాలు లేవు.. మంచీ లేదు.. చెడూ లేదు.
కలగాపులంగా కలిసిపోయిన రంగుల్లో ఏ రంగు ఈ క్షణానికి ప్రామినెంట్‌గా కన్పిస్తే నీ రూపం, నువ్వు అదే అనుకుంటావు, ప్రపంచం అనేస్తుంది.
మనిషీ, జంతువు, ప్రాణం లేని వస్తువులోనూ ఆవరించి ఉన్న ద్వైదీ భావాన్ని పటాపంచలు చేసి నువ్వెలా మంచోడివి కాగలవు మనిషీ.. నువ్వెలా జ్ఞానికి కాగలవు, నీలో దెయ్యాన్ని పారద్రోలి కేవలం దైవంగా ఎలా ఉండిపోగలవు.. అది ప్రకృతి విరుద్ధం కాదూ!
నీకు లేబుల్స్ వేస్తున్నారా.. నీకు బ్రాండింగ్ వేస్తున్నారా.. ఆ మనుషులు తమలో ఉండే భిన్నత్వాన్ని రుచిచూసే క్షణం వస్తుంది మనిషీ.. అప్పుడు వాళ్లలోని క్రూరాలూ, కర్కశాలూ, అజ్ఞానాలూ, అసూయలూ, మానవత్వ లేమీ అన్నీ బయటకు వస్తాయి.
నీటిలా ప్రవహించడమే నీ నైజం. నీలోని ద్వైదీభావాన్ని చూసి గంరగోళపడకుండా ముందుకు సాగిపో.. ధైర్యానికీ, భయానికీ, మానవత్వానికీ, దానవత్వానికీ అర్థాలు లేవని సులభంగా నీకే అర్థమవుతుంది.
గమనిక: ఇది అర్థమైన వాళ్లకి జీవితం అర్థమైనట్లే!
Comments
Post a Comment