నిరంతరం మనం అన్వేషించే పదం ఇది. అలసిపోయి కళ్లు మూసుకుని నిద్రపోవడం ప్రశాంతత కాదు.. బుర్ర హీటెక్కి పోయి నిస్సహాయంగా ఉండిపోవడం ప్రశాంతత కాదు. ఓ నిశ్చల స్థితిలో లభించే అద్భుతమైన ఫీలింగ్ ప్రశాంతత.
Stillness ఈ పదం చాలామందికి అర్థం కాదు. పనులు పెండింగ్ పెట్టుకోవడం.. వాటి గురించి టెన్షన్ పడడం లేదా జరిగిపోయిన వాటి గురించి ఎక్కువ ఆలోచించేయడం, మన భయాల్ని గుర్తు చేసుకుని మరింత భయపడడం, చుట్టూ ఉన్న మనుషుల్ని చూసి ముడుచుకుపోవడం.. మనల్ని మనం మోడిఫై చేసుకుని బ్రతికేయడం.. ఇలాంటి అనవసరమైన ప్రవర్తనల వల్ల మనం పోగొట్టుకునే స్థితి ఇది. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే ఈ క్షణంలో బ్రతకడం.. ఈ క్షణం గురించి మాత్రమే.. అదీ అవసరం ఉంటేనే ఆలోచించడం.. అవసరం లేని ఆలోచనలను ఎంటర్‌టైన్ చెయ్యకపోవడం!
ఆలోచించకుండా ఉండాలంటే మనకు భయం.. ఆలోచించకుండా ఎలా ఉండగలం.. అనే ఓ కన్‌ఫ్యూజన్. కానీ అనవసరమైన ఆలోచనలు లేని నిశ్చలమైన స్థితి కొద్ది క్షణాలైనా ఆస్వాదించిన వారు ఆ స్థితిని వదిలిపెట్టబుద్ధి కాదు. దాన్ని చేరుకునే వరకూ మాత్రమే మన ఊగిసలాట. ఒకసారి చేరుకున్నాక యధాతధ స్థితిలో బ్రతకడం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఏళ్ల తరబడి మెడిటేషన్ చేయాల్సిన పనిలేదు.. stillness రావాలంటే! ఈ క్షణం కళ్లెదుట కన్పించే దానిలో లీనమైపోతే తెలీకుండానే వాస్తవంలో బ్రతకడం మొదలెడతాం. బండి డ్రైవ్ చేస్తుంటే కళ్లెదుట కన్పించే మనుషుల దగ్గర్నుండి రోడ్ మీద ఉండే గుంతల వరకూ ప్రతీదీ నిశితంగా డెడికేటెడ్‌గా అబ్జర్వ్ చేస్తూ.. ఆ అబ్జర్వేషన్ నుండి ఎలాంటి ప్రత్యేకమైన ఆలోచనలకు వెళ్లకుండా కళ్లెదుట కన్పించిన ప్రపంచాన్నే ఫాలో అవుతూ పోతే వాస్తవంలో బ్రతకడం మొదలెడతాం. ఆ వాస్తవం నిశ్చలమైన స్థితికి మార్గం వేస్తుంది. ఉదయాన్నే సూర్యుడు గానీ, మొక్కలు గానీ, కళ్లెదురు కన్పించే మోనిటర్ గానీ, సెల్‌ఫోన్ గానీ... ప్రతీ వస్తువుతోనూ సాన్నిహిత్యాన్ని ఏర్పరుచుకుంటూ పోతే ఊహల్లో, భయాల్లో, పరధ్యానంలో బ్రతకడం ఆగిపోయి వాస్తవంలో బ్రతకడం మొదలవుతుంది.
మొదట్లో 2-3 నిముషాలకు మించి వాస్తవంలో ఎవరూ ఉండలేరు. ఉన్న 2-3 నిముషాలు అద్భుతంగా ఉంటుంది. మనం తీసుకునే శ్వాసా, ఎలాంటి హెవీ ఆలోచనలు లేని మన బ్రెయిన్ చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. ఆ కొద్దిసేపటి తర్వాత ప్రపంచాన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వెంటాడి మళ్లీ టెన్షన్లలో పడిపోతాం. అయినా ఫర్లేదు.. మీరు గమనించినప్పుడల్లా ఈ యధాతధ స్థితిలో రోజు మొత్తంలో కొన్ని నిముషాలైనా గడపండి.. కొన్నాళ్లకు రోజువారీ హెవీ ఆలోచనల నుండి మనం తీసుకునే ఈ pauseలు తెలీకుండానే మన ఆలోచనల్ని తగ్గించేస్తాయి.. మనల్ని మరింత ప్రశాంతం చేస్తాయి. మెదడులో వచ్చే ప్రతీ ఆలోచననీ ఫాలో అవండి తగ్గించండి.. కేవలం వాస్తవంలో కళ్లెదుర ఉన్న ప్రపంచంలో మాత్రమే బ్రతకండి. ఖచ్చితంగా మన జీవితంలో ఊహించలేనంత గొప్ప మార్పు వస్తుంది.
Comments
Post a Comment