జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం ఆర్ టీ-పీసీఆర్ (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది.
లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు.
10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా పెరిగాయి. ఆయాసం ఎక్కువైంది.
సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నాడు. అందులోనూ నెగెటివ్ వచ్చింది.
రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుండటంతో... ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కూడా ఆర్ టీ-పీసీఆర్ పరీక్ష చేయగా కొవిడ్ లేదు.
ఈ పరిస్థితుల్లో ఛాతీ CT స్కాన్ తీయించిన వైద్యులు.. కొవిడ్ గా నిర్ధారించి, చికిత్స అందిస్తున్నారు.
పరీక్షలు చేస్తే వెల్లడైన ఫలితాలనే ఎవరైనా నమ్ముతారు. వైరస్ ఉంటే ఉన్నట్లు.. లేకపోతే లేనట్లుగా భావిస్తారు.
కరోనాగా నిర్ధారిస్తే.. దానికి తగ్గట్లుగా చికిత్స పొందుతూ మానసికంగా సన్నద్ధమవుతారు.
లేదని తేలితే.. వైరస్ సోకలేదని ఊరట పొందుతారు.
అయినా లక్షణాలు కనిపిస్తుంటే.. సీజనల్ వ్యాధులు కావచ్చులే అని అనుకునే అవకాశాలూ ఉన్నాయి.
అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమించి, చివరకు ‘ CT స్కాన్’ ద్వారా కొందరిలో కొవిడ్ ను నిర్ధారించాల్సి వస్తోంది.
ప్రస్తుతం ఈ తరహాలో కరోనా నిర్ధారణ అవుతున్నవారు కూడా గుర్తింపు సంఖ్యలోనే వెలుగులోకి వస్తున్నారు. వీరిలో ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది.
కొవిడ్ ను గుర్తించి, కచ్చితమైన చికిత్స అందించకపోవడం వల్ల ఈ తరహా వ్యక్తుల్లో కొన్నిసార్లు పరిస్థితి విషమించి... ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది.
కరోనా నిర్ధారణ కాకపోయినా.. లక్షణాలు మాత్రం కొనసాగుతుంటే.. మరింత లోతుగా పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
నాలుగడుగులు వేస్తే ఆయాసం వస్తున్నా... రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువైనా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
వైరస్ ఉందా? లేదా? తెలిసేదెలా?
కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత క్రమేణా పెరిగిపోతుంటాయి. ఆ తర్వాత రోగ నిరోధక శక్తి సామర్థా్యన్ని బట్టి తగ్గిపోతాయి.
శరీరంలోకి ప్రవేశించిన వైరస్ ను యాంటీజెన్ అంటారు.
వైరస్ ను ఎదుర్కోవడానికి మన శరీరం స్పందిస్తుంది దీన్ని యాంటీబాడీస్ అంటారు.
ఈ యాంటీబాడీస్ రెండు రకాలు..
1. ఐజీఎం (ఇమ్యునోగ్లోబులిన్స్ -ఎం)
2. ఐజీజీ (ఇమ్యునోగ్లోబులిన్స్ -జి)
వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తొలి 7 రోజుల వరకూ యాంటీబాడీస్ ఉండవు.
7 రోజుల తర్వాత మొదట ఐజీఎం తయారవుతాయి.
పరీక్షల్లో ఐజీఎం పాజిటివ్ ఉంటే.. తాజాగా ఇన్ ఫెక్షన్ బారినపడినట్లుగా అర్థం. ఇవి 7-21 రోజుల వరకూ శరీరంలో ఉంటాయి.
ఆ తర్వాత ఐజీజీగా రూపాంతరం చెందుతాయి. ఐజీజీలు కూడా సాధారణంగా వైరస్ శరీరంలో ప్రవేశించిన 14వ రోజు నుంచి తయారవుతాయి.
ఐజీజీ ఉన్నట్లుగా ఫలితాల్లో నిర్ధారిస్తే.. ఆ వ్యక్తికి వైరస్ వచ్చి వెళ్లిపోయిందని అర్థం.
సాధారణంగా 28 రోజుల తర్వాత శరీరం నుంచి వైరస్ పూర్తిగా వెళ్లిపోయి, కేవలం ఐజీజీ యాంటీబాడీస్ మాత్రమే ఉంటాయి.
ఒకవేళ రోగికి వైరస్ సోకిందా? లేదా? అని కచ్చితంగా తెలియాలంటే..
ఆర్ టీ-పీసీఆర్ తో పాటు ఐజీఎం, ఐజీజీ పరీక్షలూచేయాలి.
ఈ పరీక్షలకు సుమారు రూ.600 -1000 వరకు ఖర్చవుతుంది.
అయితే ఇప్పటివరకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం వైరస్ ను తొలిదశలో గుర్తించడానికి ఆర్ టీ-పీసీఆర్ పరీక్షనే ప్రామాణికం.
సీటీస్కాన్ లో గుర్తిస్తే కరోనాగా చికిత్స
ఛాతీ స్కాన్ చూసినప్పుడు.. అందులో ఐదు స్థాయులను పరిశీలిస్తాం.
ఐదో స్థాయిలో ఉంటే వందశాతం కొవిడ్ గానే పరిగణిస్తాం. 2వ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే కొవిడ్ లక్షణాలకు దగ్గరగా ఉన్నట్లుగా భావిస్తాం.
సీటీ స్కాన్ ను పరిశీలించడం ద్వారా శ్వాసకోశాల్లో వైరస్ ఎక్కడెక్కడ వ్యాపించింది? దాని తీవ్రత ఎంతనేది తెలిసిపోతుంది.
కొంచెం ఆలస్యమై నిమోనియా చేరితే..
అప్పుడు బ్రాంకోస్కోపీ చేసి శ్వాసకోశాల్లో ద్రావణాలను పరీక్షిస్తే అందులో కచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది.
బ్రాంకోస్కోపీ క్లిష్టమైన ప్రక్రియ. ఇది అందరిలోనూ సాధ్యం కాదు.
కొవిడ్ లక్షణాలు తగ్గకపోతే.. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి చేరడం ముఖ్యం.
ఎందుకంటే.. వైరస్ తీవ్రత తగ్గినా.. దాని ప్రభావంతో శరీరంలోని రక్తనాళాల్లో వాపు (ఇన్ ఫ్లమేషన్ ) వస్తుంది.
ఫలితంగా రక్తనాళాల్లో పొర దెబ్బతిని, రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయి.
వేర్వేరు కారణాల వల్ల పరీక్షల్లో నెగెటివ్ రావచ్చు.
ఇది కొత్త జబ్బు కాబట్టి.. దీని పరీక్షలకు తగినంత నైపుణ్యం కూడా అవసరం.
ఆర్ టీ-పీసీఆర్ లో 60-70 శాతమే కచ్చితత్వం ఉంటుంది.
సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన ( 0-5 ) రోజుల్లో ఎక్కువమందిలో లక్షణాలు కనిపించవు.
( 5-14 ) రోజుల్లో అంటే ఆ 10 రోజుల వ్యవధిలో లక్షణాలు వెలుగులోకి వస్తాయి.
( 14-21) రోజుల్లో వైరస్ తగ్గడం మొదలవుతుంది. ( 21-28 ) రోజుల్లో పూర్తిగా వెళ్లిపోయి శరీరంలో యాంటీబాడీస్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయి. ఈ సమయాల్లో ఎప్పుడు నమూనాను స్వీకరించామనే దానిపై కూడా ఫలితం ఆధారపడి ఉంటుంది.
కరోనా లేదని తేలినా.. ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి?
ఆయాసం ఉన్నప్పుడు
జ్వరం తగ్గకుండా వస్తున్నప్పుడు
దగ్గు ఆగకుండా ఉన్నప్పుడు
నీరసం, నిస్సత్తువ పెరిగినప్పుడు
రక్తంలో ఆక్సిజన్ 94% కంటే తక్కువైనప్పుడు
ఎందుకిలా జరుగుతోంది?
ప్రస్తుతం ఆర్ టీ-పీసీఆర్ , యాంటీజెన్ పరీక్షల ద్వారా కరోనాను నిర్ధారిస్తున్నారు.
దీన్ని నిర్వహించడానికి, నమూనా సేకరణలోనూ తగిన నైపుణ్యం, శిక్షణ అవసరం.
నమూనాను సరిగా సేకరించకపోయినా, తగినంత మోతాదులో తీయకపోయినా, తీసుకున్న నమూనాను ఎక్కువకాలం నిల్వ ఉంచినా,నిల్వ చేయడంలోనూ తగిన ప్రమాణాలు పాటించకపోయినా..
వైరస్ వృద్ధి చెందకముందే నమూనాను తీసుకున్నా.. ఫలితం తారుమారు కావచ్చు.
ఉదాహరణకు కొన్నిసార్లు వైరస్ వచ్చిన తర్వాత 7-10 రోజుల మధ్య గనుక పరీక్ష చేయించుకుంటే.. అప్పటికే ఐజీఎం అభివృద్ధి చెందుతుంది.
ఆ సమయంలో ఐజీఎం వైరస్ పై దాడి చేస్తుంటుంది. వైరస్ క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గనుక పరీక్ష చేయించుకుంటే.. వైరల్ లోడ్ తక్కువగా ఉన్నప్పుడు నెగెటివ్ గా కనిపిస్తుంది.
అంటే ఆ వ్యక్తిలో వైరస్ ఉన్నా పరీక్షల్లో వెల్లడయ్యే అవకాశాలు చాలా తక్కువ...
*************************
డాక్టర్ శశికళ, పరిశోధన, అభివృద్ధి విభాగం సంచాలకులు, ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (A.I.G.E)
Comments
Post a Comment