శ్రీనివాస్ కళ్ళు తెరిచి ఏదో పని చేస్తున్నాడే గానీ మనస్సేం బాలేదు.. నిన్నకాక మొన్న అతని బాస్ కొద్దిగా కఠినంగా బిహేవ్ చేశాడు.. దాని గురించే ఆలోచిస్తున్నాడు.. ఎంత వద్దనుకున్నా ఆలోచనలు ఆగడం లేదు! ఇది శ్రీనివాస్ ఒక్కడి సమస్య కాదు. దాదాపు అందరూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రక్ అయిపోతారు. అంత ఈజీగా అక్కడనుండి కదలలేరు. ఓవర్ థింకింగ్ అనేది ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య.
మనం చేసే తప్పు!
ఒక సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవడం మానేసి.. దాన్ని రిజెక్ట్ చేయటం మొదలు పెడతాం! “ అందరూ బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు ఈ సమస్య రావాలి, దేవుడికి నా మీద కరుణ లేదు, నా టైమ్ బాలేదు” అనుకుంటూ తమపై తాము సానుభూతి పెంచుకోవడంతో పాటు.. తమ చేతిలో ఏమీ లేదని భావిస్తూ, పరోక్షంగా సబ్ కాన్షియస్ మైండ్‌కి తమని తాము నిస్సహాయులుగా ఆటో-సజెషన్స్ ఇస్తుంటారు. అలాగే అతిగా ఆలోచించే వారిని “ ఎందుకు దాని గురించి అంతగా ఆలోచిస్తారు” అని క్వశ్చన్ చేస్తే వెంటనే వచ్చే సమాధానం.. “ ఏదో ఒక సొల్యూషన్ కావాలి కదా, అందుకే ఆలోచిస్తున్నా” అని వస్తుంది. వాస్తవానికి చాలా మంది overthinking చేసేవాళ్లు, అంత ఎక్కువగా ఆలోచిస్తే మాత్రమే తమకు సొల్యూషన్ లభిస్తుందని అపోహపడుతుంటారు.
వాస్తవానికి, ఓవర్ థింకింగ్ వల్ల మన ఎమోషన్, సమస్య వల్ల ఏర్పడిన పెయిన్ మరింత పెరుగుతుంది. సమస్యను పరిష్కరించే సామర్థ్యం బ్రెయిన్ కోల్పోతుంది. ఒక సర్కిల్లో ఇరుక్కుపోయి అక్కడక్కడే తిరుగుతూ, ఆలోచించిన దాన్నే మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ సమస్యలోనే ఆలోచిస్తూ ఉంటాం తప్పించి, పరిష్కారం వైపు అసలు అడుగుపెట్టలేం. ఓవర్ థింకింగ్ చేసేవారు చాలా సులభంగా డిప్రెషన్‌కి గురవుతారు. అంతేకాదు, శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే ఒక్కసారి గమనించండి.. ఏదో సంఘటన జరిగి బాగా ఏడ్చిన వారికి, జలుబు చేయడమో, జ్వరం రావడమో చూస్తూ ఉంటాం. ఓవర్ థింకింగ్ పరోక్షంగా గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది.
ఈ ఇబ్బందులు కూడా!
అతిగా ఆలోచించడం వల్ల మెదుడులో విశ్లేషణాత్మక శక్తి తగ్గిపోతుంది. బ్రెయిన్ చాలా సులభంగా అలసిపోతుంది. దీంతో ఏదైనా పని చేయాలన్నా మోటివేషన్ కూడా రాదు, ఊరికే చిరాకు అన్పిస్తుంది, ఆ ఒత్తిడి తట్టుకోలేక అతిగా తినడం గానీ, అదేపనిగా నడవడం గానీ, లేదా కొంతమంది ఆకలి, నిద్ర లేక ఇబ్బంది పడడం గమనించవచ్చు.
గుర్తించడం..
ఓవర్ థింకింగ్‌ని అధిగమించాలంటే, అన్నిటికంటే మొట్టమొదట చేయవలసిన పని, మనం అవసరమైనదానికన్నా ఎక్కువగా ఆలోచిస్తున్న విషయం మనకు మనం రియలైజ్ అవడం! ఎక్కువ ఆలోచిస్తే మాత్రమే సొల్యూషన్ దొరుకుతుంది అనే ఓ మెంటల్ ట్రాప్ నుండి బయటపడి, ఓవర్ థింకింగ్ వల్ల పరిస్థితులు మరింత కాంప్లికేట్ అవుతాయి అన్న రియలైజేషన్‌లోకి రావాలి. ఓవర్ థింకింగ్ చేసేవారు ఎప్పుడూ పరధ్యానంగా ఉంటారు. ఫోకస్ మొత్తం చేసే పనుల మీద కన్నా, బ్రెయిన్‌లో తిరుగుతున్న ఆలోచనల మీద ఉంటుంది. కాబట్టి అతిగా ఆలోచిస్తున్నామని గుర్తించిన వెంటనే, కళ్లెదుట మనం చేసే పనుల మీద వీలైనంత వరకు దృష్టి పెట్టాలి. చదువుకుంటుంటే మనస్ఫూర్తిగా చదువుకోవడం.. ఆఫీస్ పనులు చేస్తుంటే రెండో ధ్యాస లేకుండా ఆ పని మీదే ఫోకస్ చెయ్యడం మెల్లగా అలవాటు చేసుకోవాలి. దాంతో ఓవర్ థింకింగ్ క్రమేపీ తగ్గడం మొదలవుతుంది. మెడిటేషన్ నేర్చుకొని, రోజూ కొంత సమయం చేయడం మంచిది. మెడిటేషన్ వల్ల ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఆలోచనలు తగ్గుముఖం పడతాయి.
చేయగలిగింది చేయడం!
కేవలం ఆలోచించడం ఎప్పుడూ ఏ సమస్యకీ పరిష్కారం కాదు. ఒక సమస్య విషయంలో మనం చేయగలిగింది ఏదైనా ఉంటే అప్పటికప్పుడు చిత్తశుద్ధిగా కష్టపడి చేయడం.. ఆ తర్వాత ఫలితాల గురించి వేచి ఉండడం మాత్రమే నిజమైన పరిష్కారం. మీ సమస్య గురించి.. ఇప్పటికిప్పుడు మీది ఏం చేయగలుగుతారో నోట్ చేసుకోండి. ఆ పనులు మాత్రమే చేయండి, అంతే తప్పించి కేవలం అదే పనిగా ఆలోచిస్తూ సమస్యను భూతద్దంలో చూడొద్దు.
ఎంగేజ్‌మెంట్..
సమస్యలు ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్య కూర్చొని బాధపడటం అస్సలు కరెక్టే కాదు. కాసేపు అలా బయటకు వెళ్లి పార్క్ లో వాకింగ్ చేసినా, లేదా ఫ్రెండ్స్‌కి కాల్ చేసి మాట్లాడినా, నేరుగా కలిసినా ఒక ఇష్యూ నుండి మైండ్ కొంతవరకు డైవర్ట్ అవుతుంది. అప్పుడు బ్రెయిన్ రిసోర్సెస్ ఫ్రీ అయి మనస్సు తేలికగా అనిపిస్తుంది. అలా బ్రెయిన్ లైట్ అయినప్పుడు ఆ సమస్యకు మన ప్రయత్నం ఏమీ లేకుండానే ఆటోమేటిక్ గా సొల్యూషన్ కూడా రావచ్చు.
ఎమోషన్స్ వద్దు..
మీ ప్రాబ్లం తో పాటు దానికి మసాలాలు జతచేసి ఎమోషన్స్ కలపకండి. దాని వల్ల అది మరింత పెద్దదిగా అనిపిస్తుంది. దాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు అనే భయం పట్టుకుంటుంది. సమస్యను అన్ని కోణాల్లో అర్థం చేసుకుని, రియలిస్టిక్‌గా దానికి పరిష్కారం గురించి కేవలం పని చేయండి.. అతిగా ఆలోచించి, ఆ ఆలోచనలకు ఎమోషన్స్ జత చేయొద్దు.
Comments
Post a Comment