‘స్వామీ! ఒక ధర్మసందేహం’’
‘‘సంశయించకుండా అడుగు నాయనా!’’
‘‘ప్రతిదీ నాది నాది అనుకుంటాం. దీన్నుంచి బయటపడే మార్గం లేదా?’’
‘‘ఒక చిన్నకథ చెబుతాను. విన్న తర్వాత సందేహం ఉంటే అడుగు’’
* * *
అనగనగా ఒక ఏకాంబరం. ఒకరోజు పొరుగూరికి వెళ్లి తిరిగొచ్చేసరికి అతని ఇల్లు తగలబడిపోతోంది. ఊరి జనమంతా చేరి చోద్యం చూస్తున్నారు.
ఏకాంబరం గుండెపగిలిపోయింది. తాతల కాలం నాటి ఇల్లు కళ్లెదుటే పరశురామ ప్రీతి అయిపోతోంది. ఎలా! ఎలా! మనసులో ఒకటే బాధ. ఏమీ చెయ్యలేని నిస్సహాయత. నిన్ననే ఇంటికి బేరం వచ్చింది. అసలు ధరకంటే ఎక్కువే ఇవ్వచూపాడు ఆ ఆసామి. కానీ, ఇంటి మీద మమకారంతో తనే ఒప్పుకోలేదు.
ఇంతలో ఏకాంబరం పెద్దకొడుకు వచ్చాడు. ‘‘మీరు ఊరెళ్లినప్పుడు అతగాడు మళ్లీ వచ్చాడు. ఇంకా ఎక్కువకే కొంటానని చెప్పి చాలామొత్తం బయానా కూడా ఇచ్చాడు. బేరం బాగుందని మీకు చెప్పకుండానే ఒప్పుకున్నాను’’ తండ్రి చెవిలో చెప్పాడు. ఈ మాట వినగానే ఏకాంబరం మనసు స్థిమితపడింది. ‘హమ్మయ్య! ఇప్పుడు ఇల్లు నాది కాదు’ ఈ భావన కలగగానే అతడూ చోద్యం చూస్తున్న వాళ్లలో ఒకడిగా మారిపోయాడు.
కాసేపటికి రెండో కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ‘‘మన ఇల్లు అలా కాలిపోతుంటే మీరేంటి చూస్తూ నిలబడ్డారు?’’ తండ్రిని అడిగాడు. ‘‘ఇంకెక్కడ మన ఇల్లు! మీ అన్నయ్య నిన్ననే దీన్ని అమ్మేశాడు’’ అన్నాడు ఏకాంబరం. ‘‘భలేవారే! ఆయన మనకు బయానా మాత్రమే ఇచ్చాడు. పూర్తి పైకం ఇవ్వలేదుగా’’ అన్నాడు కొడుకు.
ఏకాంబరానికి మళ్లీ దిగులు పట్టుకుంది. కొంతసేపటి కిందటి వరకూ ఉన్న ‘నాది’ అన్న భావన మళ్లీ వచ్చేసింది. ఇంతలో మూడో కొడుకు వచ్చి మరో మాట చెప్పాడు- ‘‘చూశావా నాన్నా మన ఇల్లు కొన్నవాడు ఎంత మంచివాడో! ఈ ప్రమాదం రేపు జరిగి ఉంటే ఏమయ్యేది! ఇలా జరుగుతుందని మీకూ తెలియదు, నాకూ తెలియదు. కాబట్టి మీ నాన్నను బాధపడవద్దని చెప్పు. ఆ ఇల్లు నాదే. మాట ప్రకారం డబ్బు మొత్తం ఇచ్చేస్తా అన్నాడు’’. అంటే- ఈ ఇల్లు తనది కాదు. ఈ భావన మళ్లీ అంకురించడంతో ఏకాంబరం తిరిగి నలుగురిలో ఒకడిగా మారిపోయాడు.
నిజానికి ఏదీ మారలేదు. మారిందల్లా తనదీ, పరాయిదీ అన్న భావన ఒక్కటే!
Thank You ❤️
ReplyDelete