👉 కిరణాల మార్గం సరళమేనా❓️
🌸జవాబు: విద్యుత్ బల్బు, కొవ్వొత్తి లాంటి కాంతి జనకాల నుంచి వెలువడే కాంతి కిరణాలు ఎప్పుడూ సరళమార్గంలోనే ప్రయాణిస్తాయి. అంతరిక్షంలో నక్షత్రాల నుంచి వెలువడే కాంతికిరణాలు కూడా సరళమార్గంలోనే పయనించినా, అవి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండే మరో నక్షత్రానికో, గెలాక్సీకో దగ్గరగా వచ్చినప్పుడు వక్రమార్గంలో వెళతాయి. ఈ ఫలితాన్ని 'గ్రావిటేషనల్ లెన్సింగ్' అంటారు. ఇలా కాంతి కిరణాలు వంగడం వల్ల ఆ కాంతిలో శాస్త్రవేత్తలు గెలాక్సీ వెనుక దాగి ఉండే ప్రకాశవంతమైన క్వాజర్లు (quasars) అనే ఖగోళ వస్తువులను చూడగలుగుతారు.
రోదసిలోని ఖగోళ వస్తువుల అమరికను బట్టి దూరం నుంచి సరళమార్గంలో వచ్చే కిరణాలు విల్లులాగా వంగడమో, వలయాకారాలను పొందడమో జరుగుతుంది. ఇందువల్ల వాటి కాంతి తగ్గుతుంది. కాంతి కిరణాలు వంగడానికి కారణమైన నక్షత్రం చుట్టూ ఏదైనా గ్రహం పరిభ్రమిస్తుంటే, ఆ నక్షత్రం దగ్గరకు వచ్చిన కాంతి కిరణాలు వంగడమే కాకుండా వాటి ప్రకాశం కూడా ఎక్కువవుతుంది. ఈ లక్షణం ఆధారంగా ఖగోళ శాస్త్రవేత్తలు సుదూర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలను గుర్తించగలుగుతారు.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన సామాన్య సాపేక్ష సిద్ధాంతంలో సూర్యుని గురుత్వ క్షేత్రంలోకి వచ్చిన కాంతి కిరణాలు ఎంతమేరకు వంగుతాయో లెక్కకట్టాడు. ఖగోళ శాస్త్రవేత్తలు సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో తీసిన ఫొటోల వల్ల ఆయన సిద్ధాంతం నిజమేనని నిరూపణ అయింది..
Comments
Post a Comment