మన పూర్వ ఋషులందరు సంసారులే. మరి వాళ్ళు సాధించింది మనం ఎందుకు సాధించలేకపోతున్నాం?
మొదటిది రాజోగుణం. అంటే మొదలెట్టి మధ్యలో ఆపడం. ఆపడానికి వంకలు వెదకడం. భార్య నానామాటలు అనడం, తల్లిదండ్రులు అడ్డు చెప్పడం, చుట్టాలు స్నేహితులు నిరాశపరచడం. ఇలాంటి ఎన్నో కారణాలు సాధన నుండి ప్రక్కకు తప్పిస్తున్నాయి.
సాధనలో నిలవాలంటే హిమాలయాల్లో చేసినా, కారడవిలో చేసినా వ్యామోహం, భయం నీలో ఉన్నంత కాలం నిలబడదు. ముందుగా భయం పోవాలి. తరువాత ఎవరేమన్నా తట్టుకొని నిలబడాలి. సాధన కొనసాగించాలి. ఏ సాధకుడికైనా మొదట్లో అవాంతరాలు ఖచ్చితంగా వచ్చే తీరుతాయి. ఏదీ అంత సులువుగా దొరకదు. ఆ అవాంతరాలను అధిగమించాలి. వలపు వలలు, సూటిపోటి మాటలు, భార్య కామం, కొందరు ఇష్టమైనవారు దూరం కావడం ఇలాంటివి ఎదురౌతాయి. నిబ్బరంగా నిలబడాలి.
ఇలా నిలబడగా నిలబడగా చుట్టూ ఉన్నవారు అర్థం చేసుకుంటారు. వారు వారికి తెలియకుండానే మీకు తోడ్పాటు అందిస్తారు. ఇక్కడే సమస్య మొదలౌతుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు సర్దుమణిగాక నీలో ఉన్న రాజోగుణం తమోగుణాలు బయటికి వస్తాయి. వీటిని బేధించాలి. ఇవి అంత సామాన్యంగా లొంగవు. నిష్ఠగా కూర్చున్నవాడిని ఏదో ఆలోచన తట్టి నిష్ఠ చెడగొడుతుంది. ఒక్కొక్కరోజు కూర్చోనివ్వదు. మరోరోజు వెంటనే లేపేస్తుంది. ఇంకొరోజు చుట్టుప్రక్కల వారు ఏమన్నా అనుకుంటారేమో అనే భ్రమ కల్పిస్తుంది. బయట బాధ కలిగించే సంఘటనలు సాధనకు ఓ పట్టాన కూర్చోనివ్వదు. సంతోషం వచ్చినా అంతే.
ఇలా ఎన్నో మాయలు మనసుని ఆవహిస్తాయి. వీటిని మార్చుకోవడానికి మౌనంగా కూర్చోవాలి. ఋషుల చరిత్రలు, వారు అనిసరించిన మార్గాలు, వారు పడిన కష్టాలు, సాధన చేస్తున్నప్పుడు వచ్చే ప్రతికూలతలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అంతర్ముఖుడివి అవుతూ, పరిస్థితులు, నీ ప్రవర్తన, నీలోచనలు గమనిస్తూ, కోపతాపాలకు గ్రహిస్తూ, నిగ్రహిస్తూ, నిరంతరం తననితానే పరిశీలించుతూ సాధన సాగించాలి.
ఇది నెలలు పట్టవచ్చు, ఏళ్ళు పట్టవచ్చు. ఏళ్ల అని భయపడవలసిన పనిలేదు. మనముందు ఉన్న రోజే మనది. ఈరోజు సాధన ఈరోజే ముగించు. రేపటి సాధన రేపు చేయవచ్చు. రోజులు నెలలు సంవత్సరాలు అవే గడిచిపోతుంటాయి. నీసాధన ఫలితం నీకు తెలుస్తూనే ఉంటుంది. సాధనకు సంసారం ఎప్పుడూ అడ్డుకాదు. మన ఆలోచనలు, మన ప్రవర్తనే మనకి అడ్డు. దానిని సరిచేసుకుంటూ ముందుకు సాగడమే సాధన లక్ష్యం.
Comments
Post a Comment