సముద్రంలోలాగా నదులు, చెరువుల్లో కెరటాలు ఎందుకు రావు?
🌸జవాబు: ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టే, ఎంత జలాశయానికి అంత కెరటాలు అనుకోవచ్చు. నదులు, చెరువులు, సరస్సుల్లో అలలుంటాయి కానీ కెరటాలు ఉండవు. నదులు ప్రవాహ రూపంలో ఉంటాయి కాబట్టి వాటిలోని అలలను మిగతా వాటితో పోల్చలేం. సముద్రాలు, సరస్సులు, చెరువుల్లో ఏర్పడే అలలు ఉష్ణశక్తి సంవహనం (thermal convection), ఉష్ణోగ్రతా దొంతరలు (temperature contours), జలగతిక నియమాల (hydrodynamics) సమష్టి ఫలితంగా ఏర్పడుతాయి. సంక్లిష్టమైన ఈ ప్రక్రియను స్థూలంగా అర్థం చేసుకుందాం.
నీరు అధమ ఉష్ణవాహకం. నేల కన్నా నీటిలో ఉష్ణప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. లోతైన సముద్రప్రాంతం, లేదా చెరువులో మధ్య భాగాలను తీసుకుంటే అక్కడ నీటి ఉష్ణోగ్రత, ఒడ్డున ఉన్న నీటి ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మధ్యలోని నీటి నుంచి, ఒడ్డున ఉండే నీటికి ప్రసారమవుతూ ఉంటుంది. ఇలా ప్రసారమయ్యే ప్రక్రియలో పైన చెప్పుకున్న నియమాల ద్వారా నీటి అడుగున అనుదైర్ఘ్య తరంగాలు (longitudinal waves) ఏర్పడుతాయి. చుట్టుపక్కల ఒత్తిడుల వ్యత్యాసాల వల్ల నీరు పైకి ఉబ్బి అలల్లా ఏర్పడుతాయి. వీటిని తిర్యక్ తరంగాలు (transverse waves) అంటారు. ఇవి ఆ జలాశయం లోతును బట్టి వేగాన్ని సంతరించుకుంటాయి. ఇవి ఒడ్డుకు చేరుతున్న కొద్దీ తరంగాల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఇవే పెద్ద అలలు. చెరువులు, సరస్సుల్లాంటి జలాశయాలతో పోలిస్తే, సముద్రంలో లోతు అధికం కాబట్టి ఈ అలలు క్రమేణా కెరటాలుగా మారతాయి.
Comments
Post a Comment