అశ్వధాపురం గ్రామంలో శంకరయ్య అనే వ్యాపారి ఉండేవాడు. తన దగ్గర సరకులు కొనే పేదవారికి ధర కొంత తగ్గించేవాడు. అది భార్యకు నచ్చకపోవడంతో ‘సరకులు మనం పట్టణంలో కొనుగోలు చేయాల్సిందే.
జాలి, దయతో తక్కువ ధరకు అమ్మితే మనకు ఏం మిగులుతుంది’ అని తరచూ ప్రశ్నించేది. ‘ఉన్నదాంట్లో కొంత లేనివారికి ఇస్తే తప్పేముంది?’ అని భర్త సముదాయించేవాడు.
భార్య వినకపోవడంతో కొన్ని రోజులకు శంకరయ్య అందరికీ ఒకే ధర చెప్పేవాడు. అలా సంపద పెరిగేకొద్దీ అతడి మనసులో తెలియని వెలితి ఏర్పడింది.
ఒకరోజు చిన్ననాటి మాస్టారి దగ్గరకు వెళ్లాడు. ‘గురువు గారు! వ్యాపారం తొలినాళ్లలో ఉన్న మనశ్శాంతి ఇప్పుడు కరవైంది. బాగా సంపాదించాను. కానీ, ఆత్మసంతృప్తి లేదు’ అని తన సమస్య వివరించాడు.
దానికి మాస్టారు నవ్వుతూ వెనకనున్న గాజు కిటికీలోంచి చూడమని చెప్పి.. ఏం కనిపిస్తుంది? అని అడిగారు. బయటి మనుషులు అని సమాధానమిచ్చాడు. పక్కనున్న అద్దంలోకి చూడమని.. మళ్లీ ఏం కనిపిస్తుంది అని ప్రశ్నించారు. ‘నేనే కనిపిస్తున్నా’ అన్నాడు వ్యాపారి.
☘‘కిటికీ, అద్దం.. రెండూ గాజుతో చేసినవే. కానీ కిటికీలోంచి చూస్తే మనుషులు, అద్దంలో నీ ముఖం కనిపించింది’ అన్నారు మాస్టారు. అద్దానికి ఉండే గాజుకు వెనుక పూత ఉంటుంది కానీ కిటికీకి ఉండదన్నారు.
👉👉‘వ్యాపారం తొలినాళ్లలో నీకు లాభాల కన్నా కొనుగోలుదారులపైనే దృష్టి ఉండేది. నీకున్నదాంట్లో సాయపడి సంతృప్తి పొందేవాడివి. తర్వాత సంపాదన అనే పూత మాత్రమే నీకు ధ్యేయంగా మారింది.
అందుకే మనుషులు కాకుండా నీకు నువ్వే కనిపిస్తున్నావు. ఆ పూత తొలగిస్తే మనశ్శాంతి దక్కుతుంది’ అని మాస్టారు వివరించారు.
🌿అప్పటి నుంచి శంకరయ్య తన వద్దకు వచ్చే వారి మంచిచెడులు అడిగేవాడు.
భార్య కూడా భర్త మనసును అర్థం చేసుకొని సహకరించసాగింది. పేదలకు అండగా నిలుస్తూ ఆత్మసంతృప్తితో ఉండేవాడు.
Comments
Post a Comment