తోటి మనిషికి మర్చిపోకుండా థాంక్స్ చెబుతాం.. కానీ మన జీవితానికి మనం ఎప్పుడూ కృతజ్ఞత ప్రదర్శించం! ఒక తరం క్రితం వరకూ చాలామంది పొద్దున్నే లేవగానే, రాత్రి నిద్రపోయే ముందు కళ్లు మూసుకుని దణ్ణం పెట్టుకుని, జీవితానికీ, భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకునే వారు. ఇక్కడ భగవంతుడు అనే మాట చదవగానే ఉన్నాడా లేదా అనే టాపిక్‌కి వెళ్లే మేధావితనమే మనం చూస్తున్నాం గానీ.. అది భగవంతుడు అయినా, లైఫ్ అయినా ఓ అజ్ఞాత శక్తికి వినమ్రంగా నమస్కరించడంలో తప్పేం లేదు కదా!
సమాజంలో రోజురోజుకీ పెరుగుతున్న నెగిటివ్ ఎమోషన్స్‌ని మనం absorb చేసుకోవడం చాలా కష్టం. మన మానసిక, శారీరక ఆరోగ్యాలు దెబ్బతింటాయి వాటిని లోపలికి తీసుకుంటే! అలాంటి నెగిటివ్ ఎమోషన్స్‌కి అద్భుతమైన పరిష్కారం.. వాటిని పాజిటివ్ ఎమోషన్స్‌తో మార్పిడి చెయ్యడం!
అలాంటి పాజిటివ్ ఎమోషన్స్‌లో ముఖ్యమైనది కృతజ్ఞత తెలపడం! ఈరోజు మనం శ్వాస తీసుకుంటున్నామంటే, కాళ్లూ, చేతులూ, శరీర అవయువాలూ బాగున్నాయంటే, తినడానికి తిండి ఉందంటే... ఓ ఉద్యోగమో, వ్యాపకమో, కుటుంబమో, మన వాళ్లంటూ కొంతమంది మనుషులో ఉన్నారంటే మనం చాలా పెట్టి పుట్టినట్లు! అందుకే ఈ జీవితాన్ని ప్రేమించండి.. ప్రతీరోజూ దానికి కళ్లు మూసుకుని థాంక్స్ చెప్పండి.
నిన్ను ప్రేమించే, ఆప్యాయంగా చూసే ప్రతీ మనిషికీ తరచూ ఫోన్ చేసి కాస్త ఆప్యాయంగా మాట్లాడండి. నీ ఎదుగుదలకి ఉపయోగపడిన గురువులకి నమస్కరించండి.. వారి ఆశీస్సులు లభిస్తాయి. ఇతరులు బాగుండాలని కోరుకోండి. ఇలాంటి దృక్పధం ఉన్నంత కాలం సమాజం అల్లకల్లోలం అయినా నువ్వు బాగుంటావు.. కారణం నీ మనఃస్థితి గొప్ప భావనలతో నిండి ఉంది కాబట్టి! ఇక నుండి మొదలుపెట్టండి.. అందరికీ, జీవితంలో అన్నింటికీ ప్రణామాలు తెలపడం!
Comments
Post a Comment