ఒక్కసారి ఆలొచించి చెప్పండి. మీ భార్యా/భర్త, స్నేహితుడు/రాలు, పిల్లలు,గురువు .. కాని మీకు చాలా క్లోజ్‍గా ఉండే స్నేహితులతో మీ ఆలోచనలు, అనుభూతులు,సందేహాలు, సమస్యలు అన్నీ చర్చిస్తారా? మీ జీవితంలోని ప్రతి అంశం వారితో పంచుకుంటారా? ఇది సాధ్యం కాదేమో???
మన జీవన ప్రయాణంలో ఎంతోమంది కలుస్తూ ఉండొచ్చు. అందులో కొందరు స్నేహితులైనా, జీవితభాగస్వాములైనా, ఎవరైనా కొందరితో మీరు చాలా క్లోజ్‍గా ఉండి, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కాని ఆ వ్యక్తిని మీరు పూర్తిగా నమ్మి, మీకు సంబంధించిన అన్ని విషయాలు, ఆలోచనలు చెప్తారా? ఆ వ్యక్తి ఎల్లవేళలా మీ తోడుగా ఉంటాడా?? లేదా మనుష్యులకంటే మిన్నగా మీరు ఆ భగవంతుని నమ్ముతున్నారా? ఆ సర్వాంతర్యామి అన్నీ తెలుసుకుని మీ తోడుగా ఉంటాడా? అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మీకున్నాడా? ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించండి. అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే, మీకు తోడుగా ఉండే మీ స్నేహితుడు ఎవరో కాదు అది మీరే.. అవును. మీకు మీరే గొప్ప స్నేహితులు. మిమ్మల్ని మీరు అభిమానించండి. గౌరవించుకోండి. మీ విలువ తెలుసుకోండి. ఎవరో కోన్ కిస్కాగాళ్ళు మిమ్మల్ని గౌరవించాల్సిన పనిలేదు. అవసరం కూడా లేదు.
ఎప్పుడు కూడా మనను మనం తక్కువ చేసుకోవద్దు. మనలో ఉన్న టాలెంట్‍ని గుర్తించాలి. మనకు ఏది ఇష్టం. ఏది మనకు సంతృప్తినిస్తుంది. అది ఖరీదైనదే కానక్కరలేదు. ఒక మధురమైన సంగీతమో, ఒక మంచిపుస్తకమో, లేదా ప్రకృతి సౌందర్యమో, లేదా ఆర్తులకు సహాయం చేయడమో. మన దైనందిన కార్యక్రమాలలో పడి , మన గురించి మర్చిపోతాము. చదువు, ఉద్యోగం, సంసారం, పిల్లలు, వాళ్ల అవసరాలు. ఇలా ఎన్నో పనులు చేయడంలో మనకేం కావాలో అస్సలు గుర్తుండదు. క్రమంగా ఒక మరమనిషిలా మారిపోతుంటాము. కొన్నాళ్లకు మనలో ఆనందించే గుణమే కనపడకుండా పోతుందేమో. అప్పుడు జీవితం కూడా భారమవుతుంది.
అందుకే మీ కార్యక్రమాలతో పాటు మీకోసంకూడా ఆలోచించండి. మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకుంటు ఇతరులను ఆనందపరచండి. అప్పుడు జీవితం ఎంతో ఉల్లాసంగా కనిపిస్తుంది.ఆ ప్రయాణంలో అలసట అన్నదే అనిపించదు. పైగా ఉత్సాహం పెరుగుతుంది..
Comments
Post a Comment