ఆపద దాటాలంటే శత్రువుతో నైనా స్నేహం చెయ్యాలి. గండం తీరగానే శత్రువును దూరంగా వుంచాలి.
ఒక మర్రిచెట్టు తొర్రలో ' రోమాంశుడు ' అనే పిల్లి , దగ్గరలో ఒక కన్నంలో ' పలితుడు ' అనే ఎలుక కాపురం వుంటున్నాయి.
ఒకరాత్రి వేటగాడు ఆ చెట్టుక్రింద వలపన్ని వెళ్ళాడు. తెల్లవారి చెట్టుదిగిన పిల్లి ఆవలలో చిక్కుకుని పోయింది. గిలగిలలాడసాగింది, తప్పించుకొనలేక. ఇంతలో ప్రక్కనే కన్నంలోనుంచి ఎలుక బయటకు వచ్చింది. తన శత్రువైన పిల్లి , వలలో చిక్కుకొనడం చూసి చాలా సంతోషించింది.
పిల్లి ఎలుకని చూసి ' ఓ చిట్టెలుకా ! ఈ వలను నీ పదునైన పళ్లతో కొరికి నన్ను రక్షించు ' అని అడిగింది.
ఎలుక పకపకా నవ్వి ' సహజశత్రువైన నిన్ను రక్షించడమా ' అని పిల్లిని ఏడిపిస్తూ గంతులు వెయ్యసాగింది.
ఇంతలో అక్కడికి గుడ్లగూబ వచ్చి ఎలుకని తన్నుకెళదామని అవకాశం కోసం చూస్తున్నది. అది గమనించి ఎలుక , పిల్లి వున్న వలదగ్గరకు వెళ్లి కొరుకుతున్నట్లు నటించసాగింది.
యెంతసేపటికి ఎలుక దూరంగా రాకపోయేటప్పటికీ విసిగిపోయి గుడ్లగూబ వెళ్ళిపోయింది. గండం గడిచిందని ఎలుక మళ్ళీ పిల్లిని యేడిపిస్తూ గంతులు వెయ్యసాగింది.
పిల్లి ఆశ్ఛర్యపోయి, ' ఓ మూషికమా ! ఇంతసేపు వలని యెందుకు కొరకలేదు ? కొరుకుతున్నట్లు యెందుకు నటించావు ? ' అని అడిగింది. దాని బాధచూసి జాలిపడి ఎలుక ఆ వలని కొరికి పిల్లి బయటకు రావడానికి మార్గం సుగమం చేసింది.
వేటగాడువచ్చి వల కొరకబడి వుండడం, జంతువు పారిపోవడం చూసి, దిగాలుగా వెళ్లిపోయాడు.
తొర్రలో దూరిన పిల్లి బయటకు వచ్చి ' మిత్రమా ! నీవు చేసిన సాయానికి నీకు మంచి భోజనం పెడతాను మా ఇంటికి విందుకురా' అని పిలిచింది. పిల్లి మాటలకు ఎలుక మళ్ళీ పకపకా నవ్వి ' ఓ మార్జాలమా ! గుడ్లగూబ నుంచి రక్షించుకోవడానికి కొంతసేపు నీతో స్నేహం చేశాను. దాని బారినుంచి బయటపడ్డాను. నిన్ను వుపయోగించుకున్నందుకు కృతజ్ఞతగా నీకు ప్రాణదానం చేశాను. మన యిద్దరి కష్టాలు గడిచాయి.'
' ఇప్పుడు ఆకలితో వున్న నువ్వు చేసే విందు నాకుకాదు. నీకు. నేను పొరపాటున నీ యింటికి వస్తే నువ్వే నన్ను విందారగిస్తావు. కనుక నేనురాను. మన స్నేహం ఇంతటితో సరి.' అంటూ తుర్రుమంది. ఎలుక తెలివికి పిల్లి ఆశ్ఛర్యపోయింది. తన యెత్తు పారలేదని బాధపడింది.
' అవసరం వున్నంతవరకు ఆపద తీరేవరకు, శత్రువుతో నైనా తాత్కాలికంగా స్నేహం చెయ్యాలి తప్ప ఆ స్నేహం శాశ్వతంగా భావించకూడదు. '
Comments
Post a Comment