అర్హుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం
మళ్లీ సచివాలయ కొలువుల సందడి
ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్న సర్వేశాఖ ఏడీ నూతన్‌కుమార్, అధికారులు
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: గ్రామ/వార్డు సచివాలయాల్లో రెండో విడత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి అర్హుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. ప్రతిభ జాబితాలో తరువాత స్థానంలో ఉన్నవారికి రోస్టర్‌ను అనుసరించి మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రామ వెటర్నరీ అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, సెరీకల్చర్ సహాయకులు, మత్య్స సహాయకుల పోస్టులకు సంబంధించి రెండో విడతలో అర్హులు తక్కువగా ఉండడంతో ఉన్నవారితోనే పోస్టులను భర్తీ చేశారు. కలెక్టరేట్‌లో గ్రామ సర్వేయర్ (గ్రేడ్-3) పోస్టుల భర్తీకి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. ఈ విభాగంలో 1,271 పోస్టులకు గాను తొలివిడతలో 613 భర్తీ చేశారు. ఇప్పుడు రెండో విడతలో అర్హులైన 410 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. దీంతో గ్రామ సర్వేయర్ పోస్టులు 1,023 భర్తీ కానున్నాయి. ఇంజినీరింగ్ అసిస్టెంట్(గ్రేడ్-2), డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, ఏఎన్‌ఎం, పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-5), వార్డు సచివాలయాలకు సంబంధించి ఆరు విభాగాల్లోనూ రెండో విడత ఎంపిక ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మిగిలిపోయిన పోస్టులకు నోటిఫికేషన్
జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల్లో మొదటి, రెండో విడతలో ప్రతిభ జాబితా ప్రకారం, రోస్టర్‌ను అనుసరించి పోస్టులను భర్తీ చేసిన తరువాత, ఇంకా పోస్టులు మిగిలిపోతే వాటికి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందింది. గ్రామ సర్వేయర్ విభాగంలో రెండు విడతల్లో పోస్టులు భర్తీ చేసినప్పటికీ ఇంకా 248 మిగిలిపోతున్నాయి. వీటిలో ఎక్కవ పోస్టులు ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందినవి. మిగతా విభాగాల్లోనూ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వీటికి ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనుంది. దీనిపై జిల్లా పరిషత్తు సీఈవో ఎం.జ్యోతిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. మూడో విడత ఎంపిక ప్రక్రియ ఉండదని, రెండు విడతల తరువాత మిగిలిపోయిన పోస్టులను మళ్లీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment