కేంద్రీయ వర్సిటీల్లో 7 వేల కొలువులు ఖాళీ
నోటిఫికేషన్ల జారీకి ఈ నెలాఖరే తుది గడువు
జాతీయ అర్హత పరీక్ష (నెట్)లో అర్హత సాధించారా? పీహెచ్‌డీ పూర్తి చేశారా? బోధన వృత్తే మీ లక్ష్యమా? అయితే ఏకంగా 7 వేల కొలువులు సిద్ధంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 41 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 6,911 సహాయ ఆచార్యులు, సహ ఆచార్యులు, ఆచార్యుల పోస్టుల భర్తీకి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. జులై నెలాఖరులోపు పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేయాలని, భర్తీ ప్రక్రియ మొత్తం 6 నెలల్లో పూర్తి కావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఒక్కో విశ్వవిద్యాలయం నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. దిల్లీ జేఎన్‌యూ, మరికొన్ని వర్సిటీలు ఇప్పటికే ప్రకటన జారీ చేశాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో 140 వరకు ఖాళీలున్నాయి. వాటిల్లో 123 ఖాళీల భర్తీకి నేడో రేపో ప్రకటన జారీ కానుంది. హెచ్‌సీయూ ఉపకులపతి ఆచార్య పొదిలె అప్పారావు మాట్లాడుతూ.. తాజా భర్తీలతో ఖాళీలు చాలావరకూ తగ్గిపోతాయన్నారు.
ఇఫ్లూ పోస్టులకు దరఖాస్తు గడువు ఆగస్టు 14
హైదరాబాద్‌లోని ఆంగ్లం, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) 15 ఆచార్యులు, 24 సహ ఆచార్యులు, 13 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రకటన జారీ చేసింది. వాటికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 14 తుది గడువు. ఇఫ్లూలో బోధనేతర సిబ్బంది ఖాళీలు కూడా భర్తీ చేయాల్సి ఉందని, వాటిపైనా కసరత్తు చేస్తున్నామని ఉపకులపతి ఆచార్య సురేష్‌కుమార్ తెలిపారు.
Comments
Post a Comment