75 శాతం ఉద్యోగాలు స్థానికులకే
పీపీపీ, జేవీ ప్రాజెక్టుల్లో అమలు
కాంట్రాక్టులపై జ్యుడీషియల్ కమిషన్
వందకోట్లకు పైబడిన కాంట్రాక్టుల ఖరారు బాధ్యత కమిషన్‌దే
సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వం
సిట్టింగ్ లేకపోతే... రిటైర్డ్ జడ్జి
నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కోటా
సర్వీసు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్
రాష్ట్ర మంత్రివర్గం తీర్మానాలు
అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో చేపట్టే పరిశ్రమలు, జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టులన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. సంబంధిత పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన వారికి కచ్చితంగా జీవనోపాధి లభించడంతోపాటు స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా చట్టం చేయనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మరిన్ని బిల్లుల ముసాయిదాలను ఆమోదించారు. రూ.వంద కోట్లకు పైబడిన పనుల విలువ నిర్ధారణ, టెండర్ల ప్రక్రియ ఖరారుకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తొలి నుంచీ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే... సిట్టింగ్ జడ్జి అందుబాటులో లేకపోతే, రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించే వెసులుబాటును ముసాయిదా బిల్లులో కల్పించారు. టెండర్లను పిలవడానికి ముందుగానే అన్ని పీపీపీ, జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్పస్ వెహికల్ సహా అన్ని ప్రాజెక్టులపై న్యాయమూర్తి పరిశీలిస్తారు. పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటితే కమిషన్ పరిధిలోకి వస్తుంది. జడ్జికి సహాయంగా నిపుణులను నియమిస్తారు. అవసరమైన నిపుణులను జడ్జి కూడా కోరవచ్చు. పనుల వివరాలను వారం రోజులపాటు ప్రజలు, నిపుణులకు అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత 8 రోజులపాటు జడ్జి వాటిని పరిశీలిస్తారు. జడ్జి సిఫారసులను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. అలాగే.. ప్రజాబాహుళ్యంలో టెండర్ల సమాచారం పెట్టినప్పుడు సలహాలూ సూచనలు చేసిన వారికి తగిన రక్షణ కల్పిస్తారు. మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదన ఖరారు చేసి.. ఆ తర్వాతే బిడ్డింగ్ జరపాలని, అర్హత కలిగిన కాంట్రాక్టు సంస్థలన్నింటికీ సమాన అవకాశాలు కల్పించాలని బిల్లులో పేర్కొన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రక్రియను అడ్డుకోవాలని యత్నిస్తే, దాన్ని నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని కమిషన్ ఏర్పాటుచేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం..
ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్టులు, సర్వీసు కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులోనూ 50 శాతం మహిళకు కేటాయించాలని తీర్మానించింది. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడతారు. అలాగే... పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగా... రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీ (టైలర్లు)లకు ఏడాదికి రూ.10,000 ఆర్థిక సహాయం అందించేలా మరో తీర్మానాన్ని ఆమోదించారు. ఇక... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల ఆర్థిక, రాజకీయ అభ్యన్నతికి కూడా రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ కార్పొరేషన్లు, ఆలయ కమిటీలు, బోర్డులు, సొసైటీలు, ట్రస్టులు, మార్కెట్ యార్డుల్లో 50 శాతం పదవులు వీరికే అందించాలని తీర్మానించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకే కేటాయించాలని నిర్ణయించారు.
ఎంఎస్‌ఎంఈ కోసం వైఎస్‌ఆర్ నవోదయం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎ్‌సఎంఈ) అండగా ఉండేలా ‘వైఎ్‌సఆర్ నవోదయం’ పేరిట కొత్త పథకాన్ని అమలు చేయనున్నారు. మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎ్‌సఎంఈలను ఆదుకునేలా ఈ పథకం రూపొందించారు. 86 వేల పరిశ్రమలకు చెందిన రూ.4000 కోట్ల రుణాల ‘వన్‌టైం రీస్ట్రక్చర్’కు మంత్రిమండలి ఆమోదించింది. ఎంఎ్‌సఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
తుడా చైర్మన్‌కు టీటీడీలో చోటు
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్‌కు టీటీడీ బోర్డులో ఎక్స్‌అఫిషియో సభ్యునిగా చోటు కల్పించారు. గతంలో టీడీపీ రద్దు చేసిన ఈ నిర్ణయాన్ని... ఇప్పుడు పునరుద్ధరించారు. ప్రస్తుతం తుడా చైర్మన్‌గా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.
విద్యాసంస్థలపై నియంత్రణ
రాష్ట్రంలో స్కూళ్లు, ఉన్నత విద్యా సంస్థల పర్యవేక్షణ, నియంత్రణపై ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. ఆయా విద్యా సంస్థలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తారు. నాణ్యతా ప్రమాణాలు, ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం అమలుపై దృష్టి సారిస్తారు.
Comments
Post a Comment