ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్ కోటాకు చెందిన ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మూడో విడత సీట్ల భర్తీ ప్రక్రియను ఈనెల 31 నుంచి నిర్వహిస్తారు. రెండో విడతలో మిగిలిన సీట్లతో పాటు రాష్ట్రానికి ఆర్థిక బలహీనవర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా కింద వచ్చిన 190 ఎంబీబీఎస్ సీట్లను, అఖిల భారత వైద్యవిద్య కోటాలో రెండో విడత అనంతరం మిగిలిన సీట్లనూ కలిపి.. మొత్తంగా మూడో విడతలో భర్తీ చేస్తారు. అఖిల భారత కోటా రెండో విడత ప్రవేశాల్లో సీట్లుపొందిన అభ్యర్థులు కళాశాలల్లో చేరడానికి తుది గడువు ఈ నెల 25తో ముగియనుంది. ఆ తేదీకల్లా చేరనివారికి సంబంధించిన సీట్లను 15 శాతం వైద్యవిద్య కోటా కింద రాష్ట్రానికి తిరిగి అందజేస్తారు. ఈ మేరకు మూడో విడతకు ప్రవేశ ప్రకటనను 31న వెలువరిస్తారని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 2 నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశమిస్తారు. అదేరోజు రాత్రి మూడో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటిస్తారు. ఐదు రోజుల దాకా అంటే వచ్చే 10 వరకు కేటాయించిన కళాశాలల్లో చేరడానికి..మూడో విడతలో సీట్లు పొందినవారికి గడువిస్తారు. అఖిల భారత కోటా రెండో విడతలో సీటు వచ్చిన తర్వాత కేటాయించిన కళాశాలలో చేరని అభ్యర్థికి స్వరాష్ట్రంలో మూడో విడతలో ప్రవేశానికి అర్హత ఉండదు. ఎన్‌సీసీ, కేంద్ర సాయుధ రిజర్వు బలగాల కుటుంబాల పిల్లలకు కేటాయించిన సీట్ల భర్తీని సైతం మూడో విడత ప్రవేశాలతో పాటే నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.
25 నుంచి యాజమాన్య కోటా ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు, మైనారిటీ వైద్యకళాశాలల్లో..యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో ఆన్‌లైన్‌లో సీట్ల భర్తీని ఈ నెల 25వ తేదీ నుంచి చేపడతారు. 28 వరకు ఆన్‌లైన్‌లో ప్రక్రియ అనంతరం సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలల్లో చేరడానికి గడువు వచ్చే నెల 2దాకా ఉంటుంది. యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో రుసుములు పెంచాల్సిందిగా ప్రైవేటు వైద్యకళాశాలల యాజమాన్యాలు గతంలోనే వైద్యఆరోగ్యశాఖకు వినతిపత్రాన్ని ఇచ్చాయి. ప్రవేశాల గడువు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు.. రుసుము పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని వైద్యవర్గాలు వెల్లడించాయి.
Comments
Post a Comment