అంతర్గత మార్కుల విధానం కూడా..!
మార్చిలో 100 మార్కులకు ప్రశ్నపత్రం?
చూచిరాతల నివారణకు ఒకమార్కు ప్రశ్నలు
ప్రశ్నపత్రాల్లో మార్పులపై సాగుతున్న కసరత్తు
కేరళ, కర్ణాటకల్లో అధ్యయనానికి నిర్ణయం
పదోతరగతి పరీక్షల్లో బిట్ పేపర్‌ను తొలగించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.
అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్గత మార్కులనూ తొలగించాలని యోచిస్తోంది.
ఇందుకు సంబంధించి సమూల మార్పుల దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే మార్చిలో నిర్వహించే పరీక్షలకు 100మార్కులకు ప్రశ్నపత్రం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు అంతర్గతంగా 20, పరీక్ష ద్వారా 80మార్కులు ఇస్తున్నారు. హిందీ మినహా మిగతా వాటికి రెండు పేపర్లకు కలిపి 80మార్కులు ఉన్నాయి. ఒక్కో పేపర్‌లో 10మార్కులకు బిట్ పేపర్, మిగతా 30మార్కులకు ప్రశ్నపత్రం ఉంటోంది. ఈసారి బిట్ పేపర్ ఉంచాలా? వద్దా? అనేదానిపైనా అధికారులు చర్చిస్తున్నారు. చాలాచోట్ల పరీక్షా కేంద్రాల్లో బిట్ పేపర్ సమాధానాలను కొంతమంది ఇన్విజిలేటర్లు విద్యార్థులకు చెబుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. దీంతోపాటు అంతర్గత మార్కులను ఎవరికివారే ఇష్టానుసారంగా వేసేయడంతో ఉత్తీర్ణతశాతం పెరుగుతుందనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ప్రశ్నపత్రాన్ని కొంచెం కష్టంగా ఉండేలా రూపొందించాలని భావిస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలు అధికారులు దీనిపై చర్చలు జరిపారు. జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో ఎక్కువగా బిట్ పేపర్ ఉంటున్నందున బిట్ పేపర్ తీసేస్తే విద్యార్థులకు ఏమైన నష్టం వాటిల్లుతుందా? అనేదానిపై సమాలోచనలు జరుపుతున్నారు. బిట్ పేపర్ విధానాన్ని కొనసాగిస్తే గతంలోలాగా 15మార్కులకు బిట్ పేపర్, 35మార్కులకు ప్రశ్నపత్రం ఇవ్వనున్నారు.
ఇంటర్మీడియట్ తరహా..
పదో తరగతి ప్రశ్నపత్రాన్ని ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాల తరహాలో ఇవ్వాలని భావిస్తున్నారు. బిట్ పేపర్‌కు బదులు ప్రశ్నపత్రంలో ఒకమార్కు, రెండు మార్కులు, నాలుగు మార్కుల ప్రశ్నలు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. క్లుప్తంగా మూడు, నాలుగు లైన్లలో సమాధానం రాసేలా ఒక మార్కు ప్రశ్నలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో ఒక మార్కు ప్రశ్నలను విద్యార్థే స్వశక్తితో రాయాల్సి ఉంటుంది. బిట్ పేపర్ లేకపోవడంతో చూచిరాతలకు పాల్పడే విధానం తగ్గిపోతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయిలో 94.88%మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 94.48%మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత పెరగడానికి కారణం బిట్ పేపర్, అంతర్గత మార్కులేనని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పదోతరగతి ప్రశ్నపత్రం విధానంపైనా అధ్యయనం చేయాలని కమిషనర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు.
Yes,good decision.
ReplyDelete