ఒక స్థలం తక్కువధరకు వస్తోందని తెలిసి ప్రక్కనున్న ఊరికి కారులో
బయలుదేరి వెళ్ళి , తిరిగి ఇంటికి వస్తున్నాడు రఘు.
దారి మధ్యలో కారు అకస్మాత్తుగా రిపేరుకి వచ్చి ఆగిపోయింది.
రఘు ఎంతగా ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు.
మండుటెండలో ఆదారిలో ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు వేచి చూశాడు.
కానీ ఎవరూ రాకపోవడంతో రఘుకు దాహం వేసి,
ప్రక్కనే పొలంలో ఉన్న మోటారు బావి దగ్గరకు వెళ్ళి...........
అక్కడున్న ఒక వ్యక్తితో తాగడానికి మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు.అతను తాగేందుకు నీటిని ఇస్తూ............రఘు వివరాలను అడిగాడు.
రఘు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పగానే.............
అతను ఎంతో అభిమానంగా “ నువ్వు ఆయన కొడుకువా.............?
ఇలా నీడలోకి వచ్చి కూర్చోవయ్యా............” అని
అక్కడున్న మంచాన్ని చూపించాడు.
రఘు మంచంలో కూర్చోగానే, “ మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి కారు రిపేరు చేయడానికి మెకానిక్ ను పిలుచుకొని వస్తాను “ అని సైకిల్ తీసుకొని వెంటనే ఊర్లోకి వెళ్ళి, పది నిమిషాలకు ఒక మెకానిక్ ను తీసుకొని అక్కడికి వచ్చాడు.
టవల్ తో చెమటలు తుడుచుకుంటున్న ఆ వ్యక్తి వైపు రఘు ఆశ్చర్యంగా చూస్తూ,
“ మా నాన్న గారు మీకెలా తెలుసు..............?
నాకోసం మీరెందుకు అంత రిస్క్ తీసుకున్నారు?” అని అడిగాడు.
దానికి అతను, “ కొన్నేళ్ళ క్రితం ఒక ముఖ్యమైన పని మీద
నేను మీ ఊరికి వచ్చాను. ఆ పని ఆలస్యం కావడం ..............
తిరిగి తిరిగి అలసిపోయి ఆకలి కావడంతో ,
నాకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అక్కడే ఒక చోట కూర్చున్నాను.
దూరం నుంచి చూసిన మీ నాన్నగారు ,
నా దగ్గరికొచ్చి.........వివరాలు అడిగి.........నన్ను తీసుకెళ్ళి..........
మీ ఇంట్లో కడుపు నిండా అన్నం పెట్టించాడు.
అది నేనెప్పటికీ మరువలేనయ్యా........! “ అని అన్నాడు.
కొద్దిసేపు రఘుకు నోట మాటలు రాలేదు.
ఎప్పుడో మా నాన్నగారు అన్నం పెట్టిన విషయాన్ని గుర్తు పెట్టుకొని...........
ఇతను ఇంతగా ఆప్యాయతను చూపుతున్నాడే అని,
ఒక రకమైన ఆనందానికీ, ఉద్వేగానికీ లోనయ్యాడు.
అతని కృతజ్ఞతా భావాన్ని తలుచుకుంటూ ,
ఆ రోజు రాత్రంతా రఘుకు ఇదే ఆలోచనతో నిద్ర పట్టలేదు.
“ఎవరో బయట వ్యక్తి మా నాన్నగారు చేసిన ఒక మంచి పనిని గుర్తుంచుకొని
దానికి కృతజ్ఞతగా నన్ను అంతలా ఆత్మీయంగా చూసుకున్నాడే,
అలాంటిది నా చిన్నప్పటి నుండి నా బాగు కోసం అన్నిరకాల కష్టాలూ పడి
నన్నీ స్థితిలోకి తీసుకువచ్చిన నా కన్నతండ్రిని కనీస కృతజ్ఞత కూడా లేకుండా ఆశ్రమంలో వదిలి ఎంతటి తప్పు చేసాను” అని రఘు తీవ్రంగా మదనపడ్డాడు.
పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రిని ఇంటికి తీసుకువచ్చి, చేసిన తప్పుకు క్షమించమని పాదాల మీద పడ్డాడు రఘు.
Comments
Post a Comment