ఒక పనిని అందరికీ నచ్చేటట్లు గొప్పగా చెయ్యాలనుకోడంలో తప్పులేదు. అలా చెయ్యగలగడం చాలా గొప్ప విషయం కూడా. అయితే గొప్పగా చెయ్యాలన్న ఆలోచన నీ పనిలో ఆలస్యానికి కారణం కారాదు. దానివల్ల సమయం గడిచిపోతూంటుందే కాని నీ పని మాత్రం ఎన్నాళ్ళైనా పూర్తికాదు.
నీకున్న సమయంలో, నీ వద్ద కల పరిమిత వనరులతో చేస్తున్న పనిని నువ్వనుకున్నంత బాగా చెయ్యడానికే కృషిచెయ్యి. ఫలితాలు నువ్వనుకున్నంత బాగా రాకపోవచ్చు. అయినప్పటికీ నువ్వు పూర్తిచేసిన పని నీకంటూ ఒక విలువనూ, గౌరవాన్నీ చేకూరుస్తింది.
ఏ విధంగా చూసినా సరే చేస్తున్న పనిని ఉన్నత ప్రమాణాలతో గొప్పగా పూర్తిచేయడం ఎప్పటికీ అభిలషణీయమైనదే. అయితే ఆ అభిలాషే నీ పని పూర్తిచేయడానికి గొప్ప ఆటంకం కారాదు.
నీవు స్వీకరించిన ఉన్నత ప్రమాణాల పట్ల నిబద్ధత కలిగి ఉండడం మంచిదే. అదే సమయంలో నీవున్న వాస్తవ పరిస్థితులను ఉపేక్షించరాదు. ఎన్నాళ్ళైనా నీ పని పూర్తి కానప్పుడు నువ్వేర్పరచుకున్న ఉన్నత లక్ష్యాలకు విలువేముంది?
నీ పనిని నువ్వనుకున్నంత గొప్పగా పూర్తిచేయలేకపోవచ్చు. కానీ అనుకున్న సమయానికి నీ పనిని పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వు. అనుకున్నంత గొప్పగా కాకపోయినా సరే నువ్వు పూర్తిచేసిన పని నీకంటూ ఒక గుర్తింపునూ, గౌరవాన్నీ ఇస్తుంది. గొప్పగా ఆలోచిస్తూ ఎన్నాళ్ళైనా పని పూర్తి చెయ్యకుండా ఉండడం కంటే ఏదో విధంగా పని పూర్తి చెయ్యడమే మేలు కదా.
నువ్వు పూర్తిచేసిన పని అనుకున్నంత గొప్పగా ఉండకపోవచ్చు. అందరికీ నచ్చకపోవచ్చు. అయినా సరే నీ పనిని పూర్తిచెయ్యి. అది అందించే విలువను నీ స్వంతం చేసుకో.
Comments
Post a Comment