నా దృష్టిలో ఒక్కొకరి లైఫ్ ఒక్కో ఫార్ములా. రకరకాల స్టార్టింగ్ పాయింట్స్ దగ్గర జర్నీ మొదలుపెట్టి రకరకాలుగా జర్నీ చేసి.. చివరకు కొంత డబ్బు, కొంత ప్రాపర్టీస్ సంపాదించి.. చివర్లో ఓపిక సన్నగిల్లి, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి.. జీవితం పట్ల ఆసక్తి చచ్చిపోయి చావు కోసం ఎదురు చూడడమే జీవితం. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఏమీ లేకపోయినా సడన్‌గా ఈ ప్రపంచం నుండి వెళ్లిపోతారు. కొంతలో కొంత అదృష్టవంతులు.
1. జీరొో నుండి హీరోలుగా మనం ఎదిగేటప్పుడు కెరీర్ పరంగానే కాదు.. మనకు తెలీకుండా మన అహమూ మనిషి చుట్టూ ఓ మందపాటి లేయర్‌లా బలపడుతూ వస్తుంది. “నేను మాత్రమే ఇలా చెయ్యగలిగాను, నేను మాత్రమే గొప్ప” అనే భావన. ఈ అహంలో తమ బాధాకరమైన గతం గురించి కూడా ఎవరితో అయినా చెప్పుకోవాలంటే చాలామంది సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గుపడాలి? మోకాళ్ల లోతు మట్టిలో కాళ్లు కూరుకుపోయి ఈడ్చుకుంటూ తిరిగి మట్టి రోడ్ల గురించీ.. ఏ నగరంలోనో ఒక పూట తిని మరో పూట పస్తు ఉన్న జీవితం గురించి ఎందుకు సిగ్గుపడాలి? ఈరోజు మనం ఉన్న పొజిషన్ మాత్రమే వాస్తవం కాదు. అది end product మాత్రమే. దానికి ముందు చాలా ఏళ్ల చరిత్ర ఉంది. దానికి మనం ఎప్పుడూ గౌౌరవం ఇవ్వాలి. అలాగే నేను మంచోడిని అని చెప్పుకునే మన flaws గురించి ఎందుకు చెప్పుకోవట్లేదు?
2. మన లైఫ్‌లో ముఖ్యమైన పాత్ర పోషించిన మనుషులు చాలా ఇంపార్టెంట్. వారు లేనిదే ఖచ్చితంగా మనం లేము. కనీసం వారికి కృతజ్ఞత కూడా చెప్పలేని జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.
3. ఖచ్చితంగా నేను ఒకటి నమ్ముతాను. ఈరోజు ఉన్న మనుషులు, స్థితిగతులు, ఇంకోటీ ఇంకోటీ శాశ్వతం కాదు. ఈ విషయం చాలామందికీ తెలుసు. అయినా తెలీని మమకారం. నా వరకూ నేను ప్రతీ విషయానికీ ఎంత సంతోషిస్తానో మరుసటి క్షణం అంత డిటాచ్ అవుతాను. నాది అలుపెరగని జీవిత ప్రయాణమే తప్పించి.. ఒక మానసిక స్థితిలో ఇరుక్కుపోయి నన్ను నేను మభ్యపుచ్చుకుని నేనంటే ఇదే అని భ్రమించే ఓ భ్రమ కాదు.
4. నా ఆలోచనలు ఎప్పుడూ వ్యక్తి ఎదుగుదల మీదనే ఉంటాయి. సమాజం, వ్యవస్థల్ని రాత్రికి రాత్రి మార్చేయగలం అన్నది ఓ భ్రమ అన్నది నాకు తెలుసు. అందుకే నేను వ్యక్తుల్ని, వ్యక్తుల సమూహాల్ని ప్రభావితం చెయ్యడానికి, తద్వారా సామాజిక సేవ చెయ్యడానికి ఇష్టపడతాను.
5. చాలా సోషల్ ఇష్యూస్ మీద నేను చూపించే ఆవేశం, నేను ఫైట్ చేసే విధానం కేవలం external fight మాత్రమే. నాలో నేను చాలా శాంతంగా ఉంటాను. సమాజానికి డిటాచ్ అయి నన్ను నేను ఆవిష్కరించుకుంటూ బ్రతికేస్తుంటాను. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనం మాట్లాడగలిగిన, పరిష్కరించగలిగిన సామాజిక సమస్యల పట్ల కూడా స్పందించకపోతే ఎలా అని భావిస్తాను కాబట్టే నిజంగా సొల్యూషన్ ఉన్న కొన్ని ఇష్యూస్ మీదనే స్పందిస్తాను.
6. నాకు ఏ వ్యక్తీ, ఏ వ్యవస్థా గొప్ప కాదు. నాకు ఎవరూ ఆదర్శం కాదు. నా జీవితంలో ఉన్న ఒకే ఒక ఆదర్శం. స్వామీ వివేకానంద. పక్కన CMనీ, PMనీ తీసుకు వచ్చినా నేను ఎగబడి సెల్ఫీలు దిగను. నాకు అవసరమే లేదు. అలాగే అతి కొద్దిమంది సమకాలీన మిత్రులు, పెద్దలంటే చాలా ఇష్టం. వారితో నాకు నేను సెల్ఫీలు దిగుతాను. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే చిన్న చిన్న కుర్రాళ్లతో నాకు నేనే సెల్ఫీలు దిగుతాను.
7. నాకు వ్యక్తిగతంగా శత్రువులు ఎవరూ లేరు. ఎవరి మీదా కంప్లయింట్లు లేవు. అందరూ నాకు శ్రేయోభిలాషులే ఉన్నారు. కానీ ఏదైనా ఇష్యూ మీద ఫైట్ చేయాల్సి వస్తే బాగా తెలిసిన వ్యక్తి మీద అయినా ఇష్యూ బేస్డ్‌గా ఫైట్ చెయ్యడానికి నేను వెనుకాడను. అవతల ఎవరు ఉన్నా, ఏ విషయం ఉన్నా ధైర్యంగా నిలదీస్తాను. నేను నమ్మేది ఒక్కటే.. ఇక్కడ ఎవరూ గొప్ప కాదు. అందరం ఒకటే. తప్పుంటే తప్పుని నిలదీయాల్సిందే.
8. నా జర్నీ ఈ ప్రపంచంలో కాదు. నా మనస్సులో నాకు వేరుగా ఉంటుంది. ప్రతీ క్షణం నేను ఈ ప్రపంచం నుండి డిటాచ్ అవుతూనే ఉంటాను. ఖచ్చితంగా నన్ను నేను జయించి.. నా అహాన్నీ, నా అస్థిత్వాన్నీ జయించి.. నిజమైన ఆత్మసాక్షాత్కాారాన్ని సాధిస్తానన్న నమ్మకం నాకుంది.
Comments
Post a Comment