సంతోషకరమైన జీవితానికి నేను నమ్మే, నిరంతరం ఆచరించే కొన్ని సూత్రాలు!
1. సంతోషం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే.. దానికోసం ప్రత్యేకంగా మనం చేయాల్సింది ఏమీ లేదు అన్నది మొదట గ్రహించటం! ఆ మానసిక స్థితి మనం కోరుకున్న వెంటనే పొందగలగవచ్చు. వస్తువులతోనూ, మనుషులతోనూ, సమాజంతోనూ వచ్చే సంతోషం కన్నా నిరంతరం మనసులో ఉండే సంతోషం చాలా బలమైనది.
2. ఏ వ్యక్తి గురించీ కంప్లయింట్ చెయ్యకుండా ఉండడం. మనకు ఎవరూ హాని చెయ్యరు. మనల్ని ఎవరూ వెనక్కి లాగలేరు. ఒకవేళ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే అది మన చేతకానితనమే తప్పించి.. అది వారి తప్పు కాదు. ఏదైనా సిట్యుయేషన్ ఉంటే ధైర్యంగా ఫేస్ చేయాలి తప్పించి మనుషుల మీదా, పరిస్థితుల మీదా కంప్లయింట్ చెయ్యకూడదు. ఏదీ అనుకూలించడం లేదు అని మన మీద మనం జాలి పడకూడదు.
3. మంచి లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి. కంటి నిండా నిద్ర, శరీరానికి తగినంత ఎక్సర్‌సైజ్ ఉండాలి. నాణ్యమైన జీవన విధానం మాత్రమే గొప్ప జీవితాన్ని అందించగలుగుతుంది.
4. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అందరూ తాగుతున్నారు కాబట్టి, అందరూ స్మోక్ చేస్తున్నారు కాబట్టి అది మంచి అలవాటైపోదు. నీ శరీరాన్ని నాశనం చేసేది ఏదైనా అది చెడు అలవాటు క్రిందే లెక్క. శరీరాన్ని హింస పెట్టే హక్కు నీకు లేదు. ఎంతకాలమని నీ శరీరం నీకు కోపరేట్ చేస్తుంది? పనికిమాలిన అలవాట్లన్నీ కలిగి ఉండి.. అదేదో గొప్పలా ఫీలవ్వకు. జీవితం ఎప్పటికప్పుడు మరింత మెరుగు పరుచుకోవాలి తప్పించి దిగజార్చుకోకూడదు.
5. ఆలోచనలు ఎప్పుడూ స్పష్టంగా ఉండాలి. ఒక విషయాన్ని ఉన్నదున్నట్లు గ్రహించాలి తప్పించి దానికి ఎమోషన్లు, రాగద్వేషాలూ జతచేసి.. మనకు నచ్చినట్లు ప్రాసెస్ చెయ్యకూడదు. మనం ఆలోచించేది తప్పు అయితే నిజాయితీగా ఒప్పుకోవాలి. ఒకవేళ మనం ఏదైనా విషయం తెలియకపోతే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి.
6. మనచావాచాకర్మణా ఏ వ్యక్తికీ హాని చెయ్యకూడదు. ఒక వ్యక్తిని కించపరుస్తూ గానీ, ఒక వ్యక్తిని తక్కువ చేస్తూ గానీ నువ్వు ప్రవర్తించావంటే ఖచ్చితంగా అది నిన్ను మనిషిగా దిగజారుస్తుంది. తోటి మనుషుల్ని ప్రేమించాలన్న, గౌరవించాలన్న సంస్కారం లేని రోజున నువ్వు మనిషిగా ఉండటానికి అర్హత లేనట్లే.
7. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోవటం మాత్రమే జీవితాన్ని డైనమిక్ గా ఉంచుతుంది. ఎప్పుడూ కంఫర్ట్ జోన్‌లో బ్రతక్కు. శ్రమించు, కష్టపడు, సాధించు.. నిన్ను నువ్వు ఎప్పటికీ ఎనర్జటిక్‌గా ఉంచుకో!
8. సమాజానికి ఏదైనా చేయాలనిపిస్తే నిజాయితీగా రంగంలోకి దిగి చేయి. ఒక వ్యక్తికి మాట సాయం గానీ, లేదా వ్యవస్థకి నీ ప్రొడక్టివిటీతో సాయం గానీ లేదా ఇంకోటేదైనా.. అది ప్రాక్టికల్‌గా ఉండాలి. అంతే తప్పించి, సామాజిక బాధ్యత అని మేకప్పు వేసుకుని.. మాస్ హిస్టీరిక్‌గా రోజూ పేపర్లలో, టివిల్లో వచ్చే విషయాలకు ఎమోషన్లు పారేసుకోకు. నిజమైన సామాజిక బాధ్యత ఖచ్చితమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది. అది ఊహాజనితమైనది కాదు.
9. మనుషులతో కలువు. మాట్లాడు. సంతోషంగా గడుపు. నువ్వెక్కడ నుండో దిగివచ్చినట్లు ఫీలవ్వకు. భూమ్మీదే బ్రతుకు. మనస్సులో ఇగోలు క్యారీ చెయ్యకు. ఇక్కడ ఎవడూ గొప్ప కాదు. జీవితం అనే ప్రయాణంలో ఒక బెర్త్ బుక్ చేసుకుని ఈ భూమ్మీదకి వచ్చాం. కొంతకాలం పాటు అందరూ కలిసి జర్నీ చేసి, ఎక్కడ దిగాల్సిన వాళ్లు అక్కడ దిగిపోతారు. సో చుట్టూ ఉండే మనుషులతో సంతోషంగా బతకడమే జీవితం.
10. నీకు సాయపడిన వారి పట్ల కృతజ్ఞత చూపించు. అలాగే చిన్న వాళ్లని మెచ్చుకో.. నీకు తెలిసిన నాలుగు విషయాలు ఇతరులకి నేర్పించు. గురువుగా బ్రతుకు తప్పించి స్వార్ధపరుడిగా బ్రతక్కు. ఈరోజు ఈ భూమ్మీద నాలుగు ముద్దలు తినగలుగుతున్నాం అంటే.. వ్యవసాయం చేసిన రైతు మొదలుకుని ఇంటికి బియ్యం డెలివరీ చేసిన బిగ్ బాస్కెట్ బాయ్ వరకూ.. ఇంట్లో కష్టపడి ఓపిక తెచ్చుకుని అన్నం వండి ప్రేమగా వడ్డించిన తల్లి, భార్య వరకూ అందరి కష్టం దాగుంది. ఆ మాత్రం కృతజ్ఞత చూపించకపోతే ఇంకేం మానవత్వం ఉందని మనలో?
Comments
Post a Comment