హైద్రాబాద్‌లోనో, విదేశాల్లోనే, వేరే రాష్ట్రాల్లోనే చాలా ఏళ్ల క్రితం సెటిల్ అయిన ఆ ఊరి వాస్తవ్యుడు దగ్గర పట్నంలో రైల్వేస్టేషన్‌కి అర్థరాత్రి ఏ చెన్నై ఎక్స్‌ప్రెస్‌తో వచ్చి, స్టేషన్‌కి వచ్చి పికప్ చేసుకున్న బంధువు స్కూటర్ మీద ఇంటికి చేరుకుంటాడు.
పొద్దున్నే టిఫిన్ చేసి, అల్మారాలో ఉన్న నాన్న అడ్డ లుంగీ కట్టుకుని, నాలుగు వీధుల అవతల ఉన్న ఊరి సెంటర్‌కి స్నేహితుల్ని కలవడానికి బయల్దేరతాడు. ఒక్కో ఇల్లు దాటుకుంటూ వెళ్లే కొద్దీ వరుసకి పిన్నో, బాబాయో, అత్తయ్యో, మామయ్యో, తమ్ముడో, అక్కనో.. ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉంటారు. ఆ మూల మీద పాతబడిపోయిన ఓ పెంకుటింటి వసారా క్రింద కూర్చున్న ఓ ముసలి తాత.. 'ఏరా అబ్బాయి.. ఇదేనా రావడం, ఇప్పుడు ఏ ఊళ్లో ఉంటున్నావు, ఎంతొస్తుందేంటి' అంటూ ఆరా తీయగానే ఆగి నవ్వుతూ, "ఆ, కంప్యూటర్ పనిలే, బానే వస్తుంది" అని సమాధానమిచ్చి ముందుకు కదులుతాడు. మరో పెరట్లో గోడ మీద బట్టలు ఆరేస్తూ.. ఓ పిన్ని "ఈ ఏడన్నా పప్పన్నం పెడుతున్నావారా.. మీ అమ్మకి తొరగా ఓ కోడలిని చూడు, తెగ కష్టపడిపోతోంది.." అంటూ మొహమింత చేసుకుని పలకరిస్తుంది. మనోడు సిగ్గుపడుతూ.. అప్పుడేనా పిన్నీ, కాస్త మంచిగా సెటిల్ కానీయ్.. అంటాడు.
మరో గుమ్మం అరుగు మీద బావ వరుసకి అయ్యే మరో ఆయన మీసాలు మెలేసుకుంటూ కూర్చుని ఉంటాడు. "ఏం బావా.. రోజురోజుకీ సోకులు ఎక్కువవుతున్నాయి, అక్కకి చెప్పమంటావా ఏంటి" అంటూ పరాచికాలాడుతూ ఉంటాడు ఈ కుర్రాడు. "ఆ చెప్పురా చెప్పు, నీకూ, మీ అక్కకీ భయపడడానికే ఇక్కడుంది" అంటూ తన ధైర్యాన్ని చూపిస్తాడు ఆ బావ.
ఇలా ప్రతీ గుమ్మం దగ్గరా ఎవరో ఒకరి పలకరింపులు.. మన కోసం నలుగురు మనుషులు ఉన్నారనే నమ్మకం. వాళ్ల లోపల వంద కుళ్లులు ఉండనీయి.. కనీసం నోరు తెరిచి.. ఏరా అబ్బాయ్.. అనే ఓ స్వంత వ్యక్తిగా own చేసుకునే మాట వింటే హృదయం పులకించిపోతుంది. ఏమైపోయాయి.. ఆ పలకరింపులు!
ఇప్పుడే బయట నుండి వస్తూ మా క్రింద ఫ్లాట్‌లో పిల్లలు ఆడుకుంటుంటే.. ఓ ఐదేళ్ల పిల్లాడిని వరుసగా నెంబర్లు అడిగి అప్పజెప్పించుకున్నాను.. అంతలో దూరం నుండి వాళ్ల నాయనమ్మ, తాతయ్య మురిపెంగా చూసుకుంటూ .. "ఏం సార్.. మా మనవడు ఏమంటున్నాడు" అని అడిగారు కళ్లంతా వెలిగిపోతుంటే! "మీ వాడు చాలా తెలివైన వాడు" అని నేనంటే, వాళ్ల సంతోషం మాటల్లో చెప్పలేనిది. మనుషులంటే ఇంతే.. అనుబంధాలతో పెనవేసుకుపోయే జీవితాలు!
Comments
Post a Comment