మోటివేషన్... పొరపాట్లు ఎవరైనా చేయచ్చు; వాటిని సవరించుకొని, తిరిగి ఆ తప్పులు చేయకుండా ఉండటమే గొప్ప.......!!
నరసన్న పేటలో గీత అనే ఒక చక్కని అమ్మాయి ఉండేది. గీతకు తోడు నీడగా ఉండేవాడు, వాళ్ల అన్నయ్య మహేష్. మహేష్ చదువు పూర్తి చేసుకుని, కొంతకాలంగా ఉద్యోగం చేస్తున్నాడు . గీతేమో పదో తరగతి చదువుతోంది.
గీత, మహేష్ లకు అమ్మానాన్నలు లేరు. అన్నా చెల్లెళ్ళే ఇద్దరూ ఒకరికొకరు సాయంగా ఉండేవారు. మహేష్ ఇంటికి కావలసిన సంబారాలు తెచ్చిపెట్టటంతో పాటు గీత బడి ఫీజులు, పుస్తకాల ఖర్చులు అన్నీ తనే చూసుకునేవాడు. గీతకు ఏం కావాలంటే అవి తెచ్చి ఇచ్చేవాడు:
"చదువే మన ఆస్తి చెల్లీ. మనకు వేరే ఆస్తులేమీ లేవు. మనం బాగా చదువుకోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు" అని ఎప్పుడూ చెబుతుం-డేవాడు మహేశ్. గీతకూడా అన్న మాట జవదాటేది కాదు. చాలా బాగా చదివేది.
సరిగ్గా ఆ సమయంలోనే మహేశ్‌కు పెళ్ళి కుదిరింది. మహేశ్ వ్యక్తిత్వాన్ని, మంచి తనాన్ని చూసి పెద్ద ఇంటి వాళ్ళు ఒకరు తమ అమ్మాయి అంజలిని అతనికిచ్చి వివాహం చేశారు.
కొత్తగా పెళ్లయి ఇంటికొచ్చిన అంజలి మంచిదే కానీ, ఆమెకు కొన్ని ఖరీదైన అలవాట్లు ఉండేవి. భర్త సంపాదన తక్కువ అనీ, ఇంకా చదువుకుంటున్న ఆడపడుచు గీత తమకు బరువనీ అనిపించేది ఆమెకు.
అవన్నీ మనసులో పెట్టుకొని అంజలి గీతపట్ల కఠినంగా వ్యవహరించటం మొదలు పెట్టింది. గీతకు ఆ సమయంలో తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చి బాగా ఏడ్చేది. అయినా తన బాధని అన్నతో చెప్పుకునేది కాదు. "రోజంతా ఆఫీసు పనులతో అలసిపోయి, చీకటి పడి ఇంటికొచ్చే అన్నతో బాధ కలిగించే సంగతులు చెప్పేదెందుకు?" అనుకొని, వదిన చేసే అవమానాలను దిగమ్రింగి అణకువగా ఉండేది.
అయినా మహేశ్ గీత చదువుల గురించి ఆలోచిస్తూనే ఉండేవాడు. "గీత చక్కగా చదువుతుంది. నువ్వు కూడా బాగా చదువుకున్నదానివి గదా, కొంచెం తనకు చదువుల్లో సాయం చెయ్యి. నాకు అంతగా వీలవ్వటం లేదు" అని అంజలికి చెబుతూ ఉండేవాడు. అంజలి మాత్రం గీత చదువుల్ని అస్సలు పట్టించుకునేది కాదు. తన లోకంలో తను ఉండేది.
అట్లా కొన్నాళ్ళు జరిగాక, పరీక్షల సమయం దగ్గర పడింది. "చెల్లె ఎలా చదువుతోందో" అని మహేశ్‌కు ఆరాటం మొదలయింది. అంజలి మాత్రం గీత గురించి అతనికి చాలా చెడ్డగా చెప్పింది: "గీత బాగా చెడిపోయింది. తనకు మార్కులు అస్సలు రావడం లేదు.
చెడు సావాసాలకు పోతోంది. రాత్రులు ఇంటికి ఆలస్యంగా వస్తోంది. ఫోన్లు ఎక్కువగా చేస్తోంది.." అని ఇంకా ఏవేవో చెప్పింది. చెల్లెలి మీద చాలా ఆశలు పెట్టుకున్న మహేశ్ మనసు విరిగిపోయింది. అప్పటినుండి ఇక అతనికి గీతతో మాట్లాడటమే ఇష్టం కాలేదు.
ఈ సంగతి తెలిసి గీత చాలా ఏడ్చింది. కానీ చేసేదేమున్నది? పరీక్షల సమయం కదా, ఇవన్నీ పట్టించుకుంటే పరీక్షలు దెబ్బతింటాయి! అందుకని ఆమె నిబ్బరంగా తన పని తాను చేసుకుంటూ పోయింది: ఇంకా బాగా కష్టపడి చదివింది. ఇప్పుడు తను ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు రాసింది. చూస్తూండగానే ఫలితాలు వచ్చాయి: గీతకు రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు వచ్చింది!
వార్తా పత్రికలన్నీ గీతను మెచ్చుకుంటూ రాశాయి. గీత చదివిన కాలేజీ వాళ్ళు గీతను, ఇంట్లో వాళ్లను పిలిచి సన్మానం చేశారు. "నా ఈ కృషికి స్ఫూర్తినిచ్చింది ఇద్దరు- ఒకరు మా అన్న, మరొకరు మా వదిన" అని స్టేజీమీద గీత చెబుతుంటే, అంజలి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
స్టేజీ నుండి క్రిందికి రాగానే గీత చేతులు పట్టుకొని, "నన్ను క్షమించు గీతా! నీ గురించి మీ అన్నయ్యకు ఏవేవో కల్పించి చెప్పాను. నీ మంచితనం నా కళ్ళు తెరిపించింది. నీలాంటి పిల్లలు నిజంగా దేవతలు" అని ఏడ్చింది అంజలి.
మహేశ్ గీతను, అంజలిని దగ్గరకు తీసుకొని- "పొరపాట్లు ఎవరైనా చేయచ్చు; వాటిని సవరించుకొని, తిరిగి ఆ తప్పులు చేయకుండా ఉండటమే గొప్ప. ఇకనుండీ మనలో మనకు పొరపొచ్చాలు వద్దు. మనది నిజంగా చల్లని కుటుంబం" అన్నాడు తృప్తిగా. గీత కూడా సంతోషంగా తలాడించింది.....!!
Comments
Post a Comment