ధైర్యంతో ప్రయత్నిస్తే సమస్తం నీ వశం.
లక్ష్య సాధనకై ధైర్యంతో అడుగిడరా.... జయమ్ము నిశ్చయమ్మురా.....
వ్యక్తి జీవిత పయనంలో విజయవంతం కావాలంటే ధైర్యమే మూలం. లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ ధైర్యంతో కష్టపడి తే విజయం దానంతట అదే దాసోహమంటుంది. ధైర్యంతో అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. మన భయాలను దూరం చేసుకోవడానికి ధైర్యం అవసరం. సరైన ప్రణాళికతో కష్టపడితే విజయం తప్పక లభిస్తుంది.
జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే ప్రయత్నిస్తారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ధైర్యంతో పని చేస్తే సమస్త శక్తి మనలోనే ఉంటుంది. దేనినైనా సాధించ గలుగుతాము. ధైర్యలక్ష్మి తోడుంటే ఇతర లక్ష్ములు ఏ విధంగా తోడు ఉంటాయో తెలిపే చిన్న కథను తెలుపుతాను.
పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. అతని రాజ్యం సమస్త ధనరాశులతో సిరి సంపదలతో తులతూగుతూ ఉండేది. అక్కడి ప్రజలందరూ ఎంతో ఆనందంగా జీవించేవారు. అతని రాజ్యం లో అష్టలక్ష్ములు స్థిరనివాసం ఏర్పరుచుకున్నాయి. ఒక నాడు అక్కడున్న అష్టలక్ష్ములకు ఆ రాజును పరీక్షించాలని అనిపించింది. అతని వద్దకు ఒక్కొక్క లక్ష్మి వచ్చి ఈ విధంగా అడగటం ప్రారంభించింది. "రాజా నేను రాజ్యం విడిచి వెళ్లాలనుకుంటున్నాను, నన్ను పంపి వేయి అని అడిగాయి". రాజు వారిని బలవంతం చేయలేక సరే నమ్మా.. మీ ఇష్టం. అని తెలిపి వారిని మర్యాదతో పంపించాడు. దీనితో రాజ్యలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి ఈ విధంగా 7 లక్ష్ములు అడిగి వెళ్లిపోయాయి.
వారు వెళ్లడంతో పొరుగు రాజ్యాలు రాజ్యంపై దండెత్తి ఈ రాజు రాజ్యాన్ని సంపదను తీసి వేసుకున్నారు. చివరికి ధైర్యలక్ష్మి వచ్చి ఆ రాజును అడిగింది నన్ను పంపి వేయమని. రాజు ఆ మాట వినడం తోనే ఆమె కాలపై పడి "తల్లి నువ్వు ఉన్నావు కనుకనే ఇన్ని లక్ష్ములు, నా రాజ్యం, సంపద అన్ని పోయినా ధైర్యంగా ఉండగలిగాను. అటువంటి నువ్వే వెళ్లిపోతే నేను ఏ విధంగా ఉండగలను, దయచేసి నన్ను విడవద్దు" అని ప్రాధేయపడ్డాడు?
దీనితో ధైర్యలక్ష్మి అక్కడే ఉండిపోయింది. అప్పుడు కొన్ని రోజులకు ఇతర లక్ష్ములు అందరూ వచ్చి ధైర్యలక్ష్మి ఎక్కడుంటే మేము అక్కడే ఉంటామని మీవద్దే ఉండనివ్వమని రాజును అడిగాయి. రాజు సంతోషంగా వారిని ఆహ్వానించాడు వారితో పాటే రాజుకు తిరిగి రాజ్యము సంపద లభించాయి .
దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు "ధైర్యం" యొక్క విలువ. కనుక ధైర్యంతో ముందుకు సాగుదాం.....!!
Comments
Post a Comment