ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులకన్నా తానే గొప్పని మనిషనుకుంటాడు కానీ మనిషికన్నా గొప్పవైన అద్భుతశక్తులు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అవి కనిపించవు కాబట్టి అవి లేనే లేవంటే మూర్ఖత్వమే అవుతుంది. మనిషి మూర్ఖత్వానికి కారణం అజ్ఞానంతో నిండిన సంకుచిత దృష్టి. దానిని అతిక్రమించి లోకాతీత దృష్టిని అలవర్చుకుంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇలా తెలిసీ తెలియని తత్వంతో తప్పులు చేస్తుండే మనిషి తప్పులు చేయడం తప్పుకాదు. చేసిన తప్పును గుర్తించి దానికి పశ్చాత్తాపపడి, సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలోనే మనిషి విజ్ఞత వ్యక్తం అవుతుంది. మనిషి చేసిన తప్పును మనిషే ఉదాత్తరీతిలో సవరించుకోవాలని సగటు మనిషిగా తన జీవితాన్ని మనముందుంచాడు దుష్యంతుడు. మంచి వ్యక్తిత్వం, రాజధర్మం, మహాశక్తి, మానవత్వం, కళా నైపుణ్యం, నిండైన మనస్తత్వం కలగలిసిన అచ్చమైన మనిషి దుష్యంతుడు. ప్రతి విద్యుక్తరీతిలో ఆచరించి ఆదర్శాన్ని వ్యక్తీకరించిన మహారాజు. కానీ తన జీవితంలో తనవల్ల జరిగిన తప్పు, అతణ్ని దుష్టుడిగా చూపెట్టలేక అతని నిజాయితీ ముందు ఓడిపోయింది. చేసిన తప్పులు జీవితంలో సరిదిద్దుకునేందుకు తప్పక మరొక అవకాశానికి తావిస్తాయని దుష్యంతుని చరిత్ర మనకు చెబుతుంది.
దుష్యంతుడు ఒకనాడు వేట కోసం అడవికి వెళ్ళి అలసిపోయి కణ్వముని ఆశ్రమాన్ని చేరుకొని అక్కడ ముని పెంపుడు కూతురు శకుంతలను చూసి, ఆమెను వలచి గాంధర్వ వివాహం చేసుకొని కొంతకాలం గడిపి, రాజ్యంలో అత్యవసర పరిస్థితి చోటుచేసుకోవడం తో, శకుంతలకు "ఇప్పుడు కాదు సరైన సమయం చూసుకొని వచ్చి నిన్ను వైభవంగా రాజ్యానికి తీసుకెళ్తాను", అని మాట ఇచ్చి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. కాలగమనంలో తాను చేసుకున్న పెళ్ళినే మరిచిపోతాడు దుష్యంతుడు. చాలారోజుల వరకూ తిరిగిరాని దుష్యంతుని దగ్గరకు కణ్వుడే తండ్రిగా బాధ్యతతో గర్భవతి అయిన శకుంతలను పంపిస్తాడు. తన కడకు వచ్చిన శకుంతలను దుష్యంతుడు గుర్తించలేకపోగా, జరిగిందంతా వివరించి తాను మీ భార్యనన్న శకుంతలను నువ్వెవరో తెలియదని చెప్పేస్తాడు. చేసేది లేక మౌనంగా వెళ్ళిపోతుంది శకుంతల. సరిగ్గా అప్పుడు దుష్యంతునిలో తెలియని ఒక పశ్చాత్తాపంతో కూడిన మానసిక సంఘర్షణ మొదలవుతుంది. శకుంతల తన భార్య అనుకోవడానికి ఏమీ గుర్తుకురావడం లేదు, కానీ శకుంతల అంతగా చెప్పేసరికి మనసులో ఎక్కడో ఓ మూల ఆమెను వివాహం చేసుకున్నానేమోనన్న అనుమానం. శకుంతల ఎంతగా చెబుతున్నా గర్భవతి అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా తిరస్కరించినందుకు, ఆమెకు కనీసం రాజుగానైనా ఆశ్రయమివ్వకపోతినే అని తనను తానే నిందించుకున్నాడు. ఆత్మవిమర్శ చేసుకుంటూ తప్పును సవరించుకునే ప్రయత్నం చేయాలనుకున్నాడు దుష్యంతుడు.
మనిషి మనసులో జరిగే సంఘర్షణకు అర్థం చెప్పడం ఎవరి తరం కాదు. సలహాలూ, సూచనలూ ఇచ్చేవారు తమ దోవలో తాము గొప్పగా చెబుతున్నామని భావించి అడగకనే అందిస్తుంటారు. కానీ ఆ సంఘర్షణ నుంచి విముక్తి పొందే మార్గం తనకు తానుగా అన్వేషించాలని నిరూపించాడు దుష్యంతుడు.
అలాగే దుష్యంతుడు నమ్మిన మరో మార్గం కాలం. "కాలం అన్నింటినీ పరిష్కరిస్తుందని" విశ్వసించి తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూనే పశ్చాత్తాపంతో సతమతమవుతాడు.
చేసిన తప్పును సరిదిద్దుకునే వరకూ మనిషి విశ్రమించినా మనసు విశ్రమించదని చెబుతాడు.
రాక్షసులతో యుద్ధంలో ఇంద్రునికి సహాయం చేయడానికి దుష్యంతుణ్ణి తీసుకెళ్ళడం కోసం వచ్చిన మాతలి దుష్యంతుని మనసులోని కలతను గమనించి వింతగా ప్రవర్తించి అతనిని మామూలు మనిషిని చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ క్షణకాలం జరిగిన దానికి స్పందిస్తూ దుష్యంతుడు తనలోనే, తన ఇంట్లోనే ఏయే లోపాలున్నాయో తెలుసుకోవడం కష్టం. అలాంటప్పుడు ప్రపంచంలో ఎవరేం చేస్తున్నారో ఎవరు తెలుసుకోగలరని అంటాడు. ఇలా అనడంలో చేసిన దానికి తాననుభవించే పశ్చాత్తాప భావన పరోక్షంగా ధ్వనిస్తుంది.
మంచైనా, చెడైనా ఏదైనా ఎక్కడైనా జరుగవచ్చు. మంచిని స్థిరపరచడం కోసం, చెడును నిర్మూలించడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండొచ్చు. కానీ సంకల్పం మాత్రం నిశ్చయమై ఉంటుందని దుష్యంతుని మాటల్లోని అంతరార్థం.
ఇంద్రునికి సహాయం చేసి దానవులతో యుద్ధం గెలిచి తిరిగి వస్తూ కశ్యపుని ఆశ్రమంలో శకుంతలనూ, తన పుత్రుడు సర్వదమనుణ్ణి కలుసుకొని జరిగిన దానికి క్షమాపణలు కోరి వారిని స్వీకరిస్తాడు. అందరి ముందూ ఆనాటి తన దుస్థితిని వ్యక్తపరుస్తూ, ఏనుగును తీసుకొచ్చి ఎదురుగా నిలబెడితే అది ఏనుగు కాదన్నాడట. అది వెళ్ళిపోతుంటే ఏనుగేమో అని సందేహం కలిగిందట. అది వెళ్ళిపోయిన తర్వాత అది ఏనుగే అన్నాడట..
అలా తన తప్పును ఒప్పుకున్న ధీరుడు దుష్యంతుడు.
తప్పులు చేయడం సహజం. చేసిన వాటిని మర్చిపోవడమో, వేరే వారిపైకి నెట్టేయడమో చూస్తూటాం. కానీ చేసిన తప్పును సరిదిద్దుకోo సరికదా అది తప్పని ఒప్పుకోకపోవడం, ఇది కేవలం మూర్ఖత్వమే కాదు, ఆ తప్పును సవరించుకునే ప్రయత్నఫలంగా ఒనగూరే మంచిని చేజార్చుకోవడం అవివేకం కూడా.
దుష్యంతుడు శకుంతలనూ, సర్వదమనుణ్ణి పొంది చారిత్రక కీర్తిని పొందాడు. ఎందుకంటే ఆ సర్వదమనుడే భరతుడై సకల భూమండలాన్నీ ఏలాడు. భరత శబ్దం నుంచే భారతీయం. భారతీయులంటే భారత దేశీయులని చరిత్రకు శ్రీకారం చుట్టబడింది.
Comments
Post a Comment