కష్టాలు మిమ్మల్ని పరీక్షించడానికి వస్తాయి, మీ సంకల్పశక్తిని, సహనమును, తితీక్షలను బలోపేతము చేసి, తద్వారా మీకు సహాయము చేయడానికి వస్తాయి. మీరు సాహసోపేతులుగా ఉండండి. ఉల్లాసముగా ఉండండి. నిరంతరము సావధానముగా, శాంతముగా, కష్టకాలములో కూడా ఈ లక్షణాలన్నింటిని కూడగట్టుకొని ఉండండి. కష్టాలనుంచి దుఃఖాలనుంచి విడుదల చేసేటటువంటి ఏ ఆధ్యాత్మిక సాధన లేదు(అభ్యాసము). (అంటే ఈ సాధన చేస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి ఇక నాకు జీవితములో ఇబ్బందులేమీ రావు, ఉండవు అనేటటువంటి సాధన అని భావము). చిత్తశుద్ధిగల సాధకునకు భగవంతుడు ప్రతి దశలో తప్పక స్వాంతన చేకూరుస్తాడు, ప్రోత్సహిస్తాడు కూడా. ఓటమి మరియు వైఫల్యము అనేవాటికి వాటి యొక్క ఉద్దేశ్యము వాటికి తప్పకుండా ఉంటుంది. విమర్శలకు కూడా వాటి ఉపయోగము వాటికి ఉంటుంది.
విచారము మరియు ఆగ్రహముల నుండి విడుదలకండి. పొగడ్తలు లేక తెగడ్తల చేత కదలక ఉండండి. దృఢముగా ఉండండి. రాయి వలే స్థిరముగా దృఢముగా ఉండండి - మానసిక ప్రకోపముల చేత, నిరాశ నిస్పృహలచేత, పరాజయముల చేత కదిలింపబడక ఉండండి. ఆధ్యాత్మిక సాధకుడు, ఆధ్యాత్మిక ప్రపంచము మొత్తము చేత నడపబడుతూ ఉంటాడు. అలా పోరాటము చేస్తున్న సాధకునికి సాధు సత్పురుషులందరు తమ నిగూఢ సహాయ సహకారమును అందిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలివేయబడరు. సాధువులు మరియు యోగులనుంచి మీరు తప్పక సాహాయము పొందుతారు. ఆ మహానుభావుల యొక్క ఆధ్యాత్మిక తరంగాలు మిమ్మల్ని లేవనెత్తుతాయి.
అత్యంత సహనము మరియు పట్టుదలతో కూడిన సాధన లేనిచో ఆధ్యాత్మిక శోధన అసాధ్యమైన కార్యమువలె తయారవుతుంది. ఆధ్యాత్మిక మార్గములో సగం సగం అనేవాటికి తావు లేదు. సత్యము మరియు సాధనల కొరకు మీరు పరిపూర్ణ హృదయాంతరవర్తులై ఉండండి. విశ్వాసము కలిగి ఉండండి. దృఢముగా ఉండండి. వ్యాపకమవ్వండి. సిద్ధిపొందండి. పరాజయములన్నీ తాత్కాలికమే. ఎదురుదెబ్బల వలన కలిగే అనుభవాలన్నీ అవసరమే. మీ ధైర్యమునంతా కూడగట్టండి. ముందుకు సాగిపోండి. జయ విజయములు మీవే! ఒకసారి సహనము, రెండవసారి సహనము .. ఇలా చివరిసారి కూడా సహనమును కలిగి ఉండండి! (అంటే.. ఒకసారో, రెండుసార్లో, మూడుసార్లో అని కాకుండా ఎప్పటికీ సహనముగా ఉండమని అర్థము). ప్రకాశమును ఆంతరికముగా దర్శింప కోరిన వారి లక్ష్యము ఇదై ఉండాలి.
ఘనమైన కార్యములన్నీ చిన్న ఆరంభములనే కలిగిఉంటాయి. అభివృద్ధి ఎప్పుడు క్రమబద్ధముగా ఉంటుంది. (అంతా ఒకేసారి జరుగదు అని భావము). ఏ పరిస్థితిలోనైనా, దేనిచేత కూడా బొత్తిగా వ్యాకులత చెందకుండా ఉండటం, జరుగుతున్న అన్ని అంశములు కూడా మారిపోయే ఘటనలేనని నిర్ణయముగా ఉండటం, జీవితానుభవములన్నింటికీ ఎల్లప్పుడూ ఏకాంతముగా, మౌనముగా సాక్షిగా అనుభూతి చెందుతూ ఉండటం - ఇవన్నీ ఆధ్యాత్మిక సాధకుని యొక్క గురుతులు.
ఈ లక్షణాలన్నిటినీ జాగరూకతతో మరియు పూర్తి అప్రమత్తతతో అభ్యసించవలసి ఉంది. ఇవన్నీ (ఇలా ఉండడము) ఒక రోజులో సాధింపబడేవి కావు. అయితే విశ్వాసముతో కూడిన అభ్యాసము చేత అవి క్రమముగా సాధింపబడుతాయి. ఏదో సూక్ష్మమైన తెలియని శక్తి మీకు మార్గదర్శనం చేస్తూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఆ శక్తిని మరియు దాని అస్థిత్వాన్ని అనుభూతి చెందండి. ఎవరైతే వైరాగ్యము, దయ, పరిశుద్ధత, సంయమనము కలిగి ఉంటారో మరియు ఎవరైతే ప్రపంచము కొరకు కోరికను త్యాగము చేసారో (పరిత్యాగము), ఇంకా ఎవరికైతేవారి మనస్సు మరియు ఇంద్రియములయందు నిగ్రహము కలవారే విజేతలు.
Comments
Post a Comment