కోతుల్లా కొండెంగల్లా దుంకుతూ
మోకాళ్లకు మోచేతులకు దెబ్బలు తాకినా
దులుపుకొని, ఉమ్మి మందు పెట్టుకొని
ఆడే కోతి కొమ్మచ్చి ఆటలు ఫ్లాష్ బ్యాక్ లా గుర్తొస్తున్నాయి
కష్టాల ముళ్లు గుచ్చుకుంటున్నా
లెక్క చేయక ఆడిన సిర్రా గోనె.. గోటీల... ఆటల
తీపిగుర్తుల చెలిమె ఊరుతూనే వుంది
మా కట్కూరు వాగులో
అనేక లోహాల పిసర్ల లాంటి ఇసుక రేణువుల్లో
అందంగా పిట్టగూళ్లు...చేసిన సైకత శిల్పులం..
శంఖులు.. కౌశికలు... రంగురంగుల రాళ్లను
ఏరుకొని దాచుకున్న పురాతత్వ వేత్తలం....
గల గలా పారే స్ఫటికంలాంటి నీళ్లలో
చేపల్తో పోటీపడి ఈదిన గజ ఈతగాళ్లం
అమాయకత్వం అణువణువు నిండి
టైమ్ మిషన్ లో ముందుకెళ్లినట్లు భావించి
బొమ్మలకు పెళ్లిళ్లు చేసి
పెద్ద మనుషుల మైనట్టు భావించిన బాల్యం
నన్ను నీడలా వెంటాడుతోంది
అమ్మా నాన్న కోప్పడ్డా
బుడుబుంగల్లా తప్పించుకొని
వానలో తడుస్తూ మట్టితో ఆనకట్టలు కడుతూ
కాలాన్ని కాయిదప్పడవలో తింపిన మధుర జ్ఞాపకాలు...
బడికి వెళ్లననీ మంకు చేస్తే
ఐదు పైసలిచ్చీ తన భుజాల కుర్చీ మీద
బడి గుడిలోకి తీసుకపోయిన నాన్న..
నా బాల్యపు మొక్కకు
తన బతుకు ఎరువును వేసి
కలుపు మొక్కల్ని తీసి పెంచిన అమ్మ గుర్తులు
పచ్చబొట్టులా...
బడికి తప్పిస్తే రకరకాలుగా శిక్షించి
జీవన విద్యా సమరంలో
జయాపజయాల పాఠాల్ని ఉగ్గుపాలతో నేర్పి
జ్ఞాన జ్యోతిని వెలిగించిన గురువుల అభయ హస్తాలు...వెన్నంటే వున్నాయి
కానీ నేటి బాల్యం యాంత్రికమైంది
సెల్ ఫోన్.. టీ వీ రిమోట్ రక్కసి బాహువుల్లో బందీ అయిపోతుంది మరి..
Super sir
ReplyDelete