నిన్నటి వరకూ ఎంతో ఇష్టపడిన మనిషిపై చిన్నదో, చితకదో కారణంతో అయిష్టం ఏర్పడుతుంది. అలా అయిష్టం మనసులో చోటుచేసుకున్న క్షణం మొదలు.. ఆ వ్యక్తీ, ఆ వ్యక్తితో ముడిపడిన ప్రతీ ఆలోచనా, ఆ వ్యక్తి హావభావాలు మొదలుకుని అభిప్రాయాలూ, మాటలూ, ఛేష్టల వరకూ ప్రతీదీ అపసవ్యమైనవిగానే, వికారంగానే కన్పిస్తుంటాయి. అవే ఆలోచనలనూ, అదే మనిషి చిరునవ్వునూ ఇన్నాళ్లూ మనం ఆస్వాదించాం. "ఎంత కల్లాకపటం లేని మనిషి మనకు జీవితంలో ఆత్మీయంగా దొరికారో కదా" అని మురిసిపోయాం. పదిచోట్లా ఆ మనిషి గురించి గర్వంగా చెప్పుకున్నాం. మరి ఆ చిరునవ్వులో ఈ క్షణం కుటిలత్వం గోచరిస్తోందంటే అది మన దృష్టిదోషమా.. లేక రాత్రికి రాత్రి ఆ మనిషిలో వచ్చిన అనూహ్యపు మార్పా?
మనుషుల్ని మనం దగ్గరకు తీసుకునేతనంలోనే మనం పరిణతిని కలిగి ఉండడం లేదు. ఒక వ్యక్తిలోని ఏదో ఒక్క పార్శ్యాన్నే చూసి మనం మనుషుల్ని అభిమానిస్తున్నాం, చేరువ అవుతున్నాం. మనకు నచ్చిన ఆ ఒక్క కోణంతో సరిపెట్టుకోకుండా మరింతగా ఆ వ్యక్తికి మనం దగ్గర అయ్యే కొద్దీ ఆ వ్యక్తిని నఖశిఖపర్యంతం గమనిస్తూ మనకు ఇంతకాలం ఆ మనిషిలో తెలియని కోణాలనూ గ్రహిస్తూ వాటినీ జడ్జ్ చేస్తూ.. వీలైతే మనకు నచ్చినట్లు ఆ ఇతర కోణాలనూ మరల్చాలని ప్రయత్నిస్తున్నాం. ఇక్కడే చిక్కు వచ్చిపడుతుంది.
ఒక మనిషిని అభిమానించడం, దగ్గరవడానికి ఎలాంటి హద్దులూ లేవు. కానీ ఒక మనిషిని సరిచెయ్యచూడడం ఎవరి తరమూ కాదు. ఆ మనిషి తనంతట తాను తన మనసులోకి పూర్తిగా మనల్ని ఆహ్వానించి మనం ఏది చెబితే దాన్ని వేదంగా పాటిస్తే తప్ప! ఇదే విషయాన్ని గతంలో "పర్సనల్ జోన్" గురించి రాస్తూ వివరించాను కూడా!
దురదృష్టవశాత్తు మనం ప్రేమించేదీ, స్నేహం చేసేదీ ఒకే ఒక్క నచ్చిన లక్షణం ఆధారంగా! జీవితాంతం ఎదుటి వ్యక్తిలోని ఆ ఒక్క నచ్చిన లక్షణంతో సరిపెట్టుకోగలిగితే సమస్యే లేదు. కానీ చిన్న సందు ఇస్తే ఆ మనిషిని ఆసాంతం ఆక్రమించి.. ఆ మనిషి నడవడికను సైతం మనమే నిర్దేశించాలనుకునే నైజం మనది. అందుకే బంధాల్లో మనస్థత్వాలు పొసగట్లేదు. ఆ పొసగకపోవడం అర్థమైన క్షణం మొదలు మనం ఇంతకాలం అభిమానించిన వారినే ద్వేషించడం మొదలుపెడుతున్నాం.
మనకో స్వంత ప్రపంచం ఉన్నట్లే, అలాగే మనలోనూ వందల పార్శ్యాలు ఉన్నట్లే ఎదుటి వారిలోనూ క్షణానుకూలంగా కోట్ల కొద్దీ పార్శ్యాలుంటాయనీ, వాటిపై మన నియంత్రణ ఏదీ సాగదని, అసలు మనం వాటిలోకి జోక్యం చేసుకోవడానికి తగమనీ అర్థం చేసుకుంటే బంధాలతో ఎలాంటి ఫిర్యాదులూ ఉండవు.
Comments
Post a Comment