" నాతోపాటు కాలేజీలో చదువుకున్న నా ఫ్రెండ్ ఒకడు ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు ప్రస్తుతం.. ఈమధ్య వాడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు " లైఫ్ ఎలా లీడ్ అవుతోందిరా " అని నేను అడిగితే మొత్తం వాడు పడుతున్న ఇబ్బందులన్నీ ఈవిధంగా చెప్పుకొచ్చాడు నాతో ఇలా.
( ఆ సంభాషణ యధాతధం )
" పొద్దున్న పదిగంటలకే ఆఫీస్ అయినా ఎనిమిదీ ఆ సమయానికే బయల్దేరాల్సి వస్తోందిరా ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందని.. ఆ సమయానికెళ్ళి రాత్రి ఇంటికొచ్చేసరికి మరలా పదవుతోంది.. ఇక అప్పుడు వంట వండుకొనే ఓపిక లేక బయటెక్కడో కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకుని తింటున్నా.. అది ఇంట్లో చేసినట్లు ఉండదుగా ? మసాలాలనీ ఇదనీ ఇదనీ ఏవేవో పేర్లు పెట్టి నానారకాల చెత్తా అందులో కలిపి ఏదో చేస్తాడు వాడు.. అదే భాగ్యం అనుకొని తెచ్చుకు తినాల్సి వస్తోంది.. అది తినడం కాసేపు కంప్యూటర్లో సినిమాలో , లేక జబర్దస్త్ వీడియోలో చూసి పడుకోవడం.. మళ్ళా లేవడం - ఆఫీస్ కి వెళ్ళడం -
తిరిగిరావడం. ఇంకేం చేద్దామన్నా టైం ఉండట్లేదు
తిరిగిరావడం. ఇంకేం చేద్దామన్నా టైం ఉండట్లేదు
పొద్దునెప్పుడో సూర్యోదయాన్ని చూస్తున్నా , రాత్రి చంద్రోదయాన్ని చూస్తున్నాను, మధ్యలో అసలీ ప్రపంచంలో ఏమవుతోందనేది కూడా తెలీట్లేదురా ,, అలా ఉంది నా పరిస్థితి " అన్నాడు.
నేను నవ్వి " కెరీర్ స్టార్టింగ్ లో ఎవరికైనా ఆ ఇబ్బందులు తప్పవురా,, జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి లేదా కొన్ని ఆలోచన లేకుండానైనా పాటించాలి ,, ఒక స్థాయి కలిగేంతవరకూ ఇది తప్పదు " అన్నాను
" ఏమి తప్పడమో ఏమిటో కానీ వాడిచ్చే జీతంలో చాలామటుకు ఇంటి అద్దెకీ ,, ఇక్కడ నా అవసరాలకే పోతోంది. ఇంటికి కూడా ఎంతో పంపలేకపోతున్నాను.. చివరికి ఒక్కోసారి ఏమనిపిస్తోందంటే " దీనికోసమా ఉన్న ఊరినీ,, ఇంటినీ, కుటుంబాన్నీ, స్నేహితులనీ వదిలి ఇలా ఒక్కడినే ఏకాకిలా బ్రతకడం ? " అని అనిపిస్తోందని అన్నాడు..
నేను నవ్వి ఊరుకున్నాను తప్ప సమాధానమేదీ ఇవ్వలేదు..
ఎందుకంటే ఈ ప్రశ్న చాలామందికే కలిగినా ఎవరికీ పరిష్కారం దొరకట్లేదు సరికదా కనీసం సహేతుకమైన సమాధానం కూడా దొరకదు..
నాగరికత అలాంటి పరుగుని నేర్పుతోంది మనిషికి ఇప్పుడు...
ఆ పరుగు ఎలాంటిదంటే ఎక్కడికి పరిగెడితున్నామో, ఎందుకు పరిగెడుతున్నామో అనే స్పృహ కూడా తెలీనీయకుండా " పరిగెట్టకపోతే ఈ పందెంలో కనీసం నిలవలేవు కూడా " అనేంత అభద్రతా భావాన్ని మనిషిలో నింపి అతని ఆత్మనీ,, స్వేచ్చనీ, జీవితంలోని ఆనందాన్నీ చంపేలా చేస్తోంది.
దానివల్ల మనిషి ఎలా తయారవ్వుతున్నాడంటే " డబ్బు బాగా సంపాదించి సౌకర్యాలు సమకూర్చుకోవడమే జీవిత పరమావధి " అన్నట్లు తయారవుతున్నాడు..
ఈ పరిణామం తప్పు కాదు.. ఎందుకంటే వనరులు తక్కువగా ఉండి జనాభా ఎక్కువగా ఉన్న ప్రపంచంలో మనిషి సంతోషకరమైన జీవితం అనుభవించాలంటే అతనికి కొన్నైనా సౌఖ్యాలు కావాలి. అందుకై సంపద ఉండాలి కానీ ఇక్కడే వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే
" సంపద అనేది నువ్వు అనుభవించేదా ? లేక నలుగురిముందూ ప్రదర్శించేదా ? " అని.
ఎందుకంటే మనిషి వాడి అవసరాలూ,, కుటుంబ సౌఖ్యం ,, వాళ్ళ భవిష్యత్తూ చూసి ఆపై వాడి కోరికలూ ,, అభిరుచులూ తీర్చుకోడానికై డబ్బు సంపాదిస్తే అందులో తప్పేమీ లేదు. అందుకై కొన్ని కొన్నిసార్లు కొన్నికొన్ని విషయాలు త్యాగం చేయాల్సిరావడం తప్పదు కూడా.
కానీ ఇప్పుడు సమాజంలోని చాలామంది మనుష్యులు ఇదొదిలేసి " నేనిత గొప్ప జీవితం గడుపుతున్నాననే ' భావాన్ని తన బంధువర్గానికీ,, తన సర్కిల్లో వాళ్ళందరికీ తెలిసేలా చేయాలనే కోరికతో డబ్బుని ఓ వేలంవెర్రిలా సంపాదిస్తున్నారు తప్ప నిజానికి వారికి డబ్బు అంతలా అవసరం ఉండి కానే కాదు.
"విలాసవంతమైన సొంత ఇల్లూ,, పెళ్ళీ పేరంటాలప్పుదు ఖరీదైన బెనారస్ చీర కట్టుకుని ఒంటినిండా బంగారాన్నేసుకుని తన మాట వింటూ తనకూడా తిరుగుతూ అణిగి ఉండే భార్యా,, ప్రతీ సంవత్సరమూ పై క్లాసులోకెళ్ళే కొడుకూ,, ముద్దుముద్దుగా మాట్లాడే బొద్దుకూతురూ,, మంచి బాంక్ బాలెన్స్ " ఇదీ విజయసూచకాలు మనిషికి ఇప్పుడు.. సంఘం కూడా ఇలా ఉంటేనే గొప్పగా భావిస్తుందని ఆ రకంగా మనిషి ఆశాపిశాచబద్ధుడై మానవసంబంధాలని నిర్లక్ష్యం చేస్తూ,, తన ఆరోగ్యాన్నీ పట్టించుకోక ఎంతో ఆత్రంతో ఇలా పరుగెడుతున్నాడు తప్ప ఆ ప్రాసెస్లో తానేం కోల్పోతున్నాడో, తనవల్ల తనవారి జీవితాన్నెంత నాశనం చేస్తున్నాడనేది తనకే తెలీట్లేదు.
అసలు జీవితాన్ని ఎవరికో నిరూపిస్తేనే అది మన విజయంగా భావిస్తున్నామంటే మన జీవితంలో శూన్యత ఉందని అర్ధం.. మనకి సరిగ్గా బ్రతకడం రాదనీ అర్ధం.. కనుక ప్రపంచం ప్రాతిపదికన ఎప్పుడూ మీ జీవితాన్నీ, విజయాన్ని నిర్ణయించుకోకండి.
మీ జీవితం - మీ ఇష్టం. అది మీకు నచ్చేలా ఉండాలి, మీరు మెచ్చేలానూ ఉండాలి..
అందుకోసమై ఏమేం చేయాలి? ఇప్పుడు నేనున్న స్థితి ఏమిటి? అది నాకు ఆనందాన్ని ఇస్తోందా లేదా? ఇవ్వకపోతే ఎందుకివ్వట్లేదు? ఆనందం ఇచ్చేలా మలుచుకోవాలంటే ఏం చెయ్యాలి? లోపం ఎక్కడుందసలు? ఇలాంటి చింతన అప్పుడప్పుడైనా కనీసం చేస్తే జీవితం మెరుగ్గా ఉంటుంది
ఈ వ్యాసాన్ని ముగిస్తూ చివరగా ఓ మాట చెప్పాలనుకొంటున్నా
" జీవితం అంటే ఠీవి, రసికతా, వైరాగ్యం, క్లుప్తత, గుప్తతా, దానగుణం, ఆత్మస్థైర్యం, దయ, జాలీ, కరుణా ఇవన్నీ సమపాళ్ళల్లో ఉండాల్సిన మిశ్రమం
దానినిలా హాయిగా గడపక కేవలం భౌతిక సుఖాలకోసమే పరిగెడుతూ జీవితంలో ఆస్వాదనని కోల్పోవడంలో అర్ధం లేదు - అలా గెలిస్తే వచ్చే విజయానికి కూడా అర్ధం లేదు " "
Comments
Post a Comment