సుఖార్థీ చేత్త్యజేద్విద్యాం విద్యార్థీ చేత్త్యజేత్సుఖం
సుఖార్థినః కుతో విద్యా? సుఖం విద్యార్థినః కుతః?
సుఖం కోరుకుంటే విద్యను వదలాలి. విద్యను కోరుకుంటే సుఖాన్ని వదలుకోవాలి. సుఖాన్ని కాంక్షించేవారికి చదువెక్కడ? విద్యకావాలనుకొనే వారికి సుఖమెక్కడ? అని ఈ శ్లోకానికి భావం.
“శ్రమ ఏవ జయతే” అనే వాక్యం అన్ని రంగాలకూ అన్వయిస్తుంది. ఏ మాత్రమూ శ్రమలేకుండా ఫలాలను ఆశించటం క్షమార్హం కాని నేరం. ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలను పొందలుగుతారు. పూర్వకాలంలో విద్యార్థులందరూ గురుకులవాస క్లిష్టంగా చదివేవారని అనేక గ్రంథాలద్వారా తెలుస్తుంది.
నిజానికి ఇప్పుడంత కష్టం అవసరం లేదు. ఆధునిక కాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ అధునాతన సాంకేతిక పరిజ్ఞాన ఫలితంగా ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఆహ్వానించి, స్వీకరించి,తమవ్యాసంగాన్నిమరింత పటిష్టం చేసుకోవటం అవసరం. ఐతే మౌలికమైన శ్రమను మాత్రం అలక్ష్యం చేయకూడదు.
ఏ సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోగల చిన్న, పెద్ద యంత్రాలు వచ్చాయని సంతోషించాలో, కొందరు పిల్లలు “రెండు రెళ్ళు నాలుగు” అని చెప్పటానికి కూడా “ క్యాలిక్యులేటర్” ఉంటేనేగానీ చెప్పలేక పోతున్నందుకు, వారి ధారణ శక్తి తగ్గుతున్నందుకు ఆందోళనపడాలో తెలియని పరిస్థితులున్నాయి.
కొందరు శ్రమపడి చదవటానికి విముఖులై, పరీక్షల సమయంలో అనూహ్యంగా అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలద్వారా పరీక్షాకేంద్రాలకు బయట ఉండేవారినుంచి సమాధానాలు పొందున్నారు.ఇలా అజ్ఞానం వికసించి, విజ్ఞానం వికటించటం సాంకేతికవిద్యా విజయం కానేరదు.
తల్లిదండ్రులు పిల్లలకు సౌకర్యాలు సమకూర్చటం అవసరమే. కానీ ఆ సౌకర్యాలు పిల్లలను సోమరులుగా, భవిష్యత్తులో ఏ చిన్న కష్టం, ఏ కొద్దిపాటి అసౌకర్యం ఎదురైనా తట్టుకోలేని వారినిగా తయారు చేయకూడదు. కష్టం అనుభవిస్తేనే సుఖం రాణిస్తుంది. కేవల సుఖలాలస జీవితాన్ని నిర్వీర్యం చేస్తుంది. శ్రమసౌందర్య సాధితమైన విద్య – సమాజం పట్ల బాధ్యతను గుర్తుచేస్తుంది.
చిరంజీవులు విద్యావంతులై, సంస్కారవంతులై అధికారులుగా, దేశాధి నేతలుగా ప్రజలకు సేవచేసి ధన్యులుకావాలంటే, ముందుగా - వారు కష్ట, సుఖాలపట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. వెలుగు లేనిచోట చీకటి ఉంటుంది.కష్టం తెలియనిచోట కఠిన స్వభావమే రాజ్యమేలుతుంది.
కష్టపడి చదవటమే సుఖాన్ని పొందటానికి యోగ్యత. “కష్టపడని వ్యక్తికి అన్నం తినే హక్కు ఉండదు” అన్నారు గాంధీజీ. అందువల్ల కష్టపడి చదువుకోవాలని, దాని వల్ల లభించే సుఖమే ఆదరణీయమని, కష్టపడకుండా విద్యను పొందాలనుకోవటం అవివేకమని గ్రహించాలి.
Comments
Post a Comment