ఈ క్షణం మరుక్షణంతో ఆక్రమించేయబడుతుంది… అలాగని అది తన ఉనికిని కోల్పోదు… ఓ ఆలోచనో, భావనో, నిర్ణయమో మరుసటి క్షణానికి మోసుకెళ్లడం ద్వారా అది సజీవంగానే ఉంటుంది..
సంవత్సరాల ప్రమాణంలో జీవితాన్నీ, వయస్సునీ కొలవడం మానేసి క్షణాల మెజర్‌మెంట్‌లో పరిగణనలోకి తీసుకుంటే జీవిత గమనంపై పూర్తి నియంత్రణ మనకు దక్కుతుంది.
ఈ క్షణాన్ని భారంగా మార్చేసిన గతించిన క్షణాలూ.. రాబోయే క్షణాల్ని కబళించే ఈ క్షణపు ఆలోచనలూ… ఈ ఘర్షణలో శుష్కించిపోతున్న ప్రస్తుత క్షణపు నిస్సహాయతా… ఇదే మనం అనుకుంటున్న వందేళ్ల జీవితం 🙂
జీవితాన్ని అర్థం చేసుకోవడానికీ… సరిచేసుకోవడానికీ స్థూల (macro level) దృష్టే కాదు… కొన్ని సందర్భాల్లో సూక్ష్మ (micro level) దృష్టీ చాలా అవసరం.. "ఆ ఏముందిలే.." అని దులపరించుకుని వేరే ఆలోచనలోకి వెళ్లిపోయిన ఎన్నో సంఘటనలు స్పష్టంగా మన "ఈ క్షణాన్ని" ప్రభావితం చేస్తున్నాయని ఒక్కోసారి గ్రహింపుకీ వస్తుంది…. అలా అన్పించినప్పుడు "ఆలోచించలేకపోయానే" అనే ఓ చిన్న గిల్టీఫీల్‌తో సాగిపోతాం తప్ప అక్కడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించడానికి తీరిక చేసుకోం.
ఇప్పుడు లైఫ్ అంటే 50 ఏళ్లల్లో సాధించాల్సినవన్నీ ఇరవై, పాతికేళ్లలోపు ఫోర్లతో, సిక్సర్లతో దక్కించుకోవడం.
ఈ వేగంలో "క్షణం" అనేది కొట్టుకుపోయింది… పది నిముషాలు తెలుగు కూడబలుక్కుని ఇదంతా చదవాలన్నా "బోర్" వచ్చేస్తుంది 🙂
క్షణం వృధా కాకూడదు… క్షణం తీరిక లేదు.. జీవితం గురించి ఏవేవో ఆలోచనలు అస్సలు అవసరం లేదు… లైఫ్ గోల్స్ సాధించడానికి అవసరం అయిన ఆలోచనలు మాత్రమే చాలు… ఇది మన స్ట్రేటజీ!! కొంతవరకూ ఇది మంచి ఫలితాలే ఇస్తుంది…
అయితే ఈ క్షణం ఓపిక పట్టలేకపోయినందువల్లా, ఈ క్షణం ఆగి ఆలోచించలేకపోయినందు వల్లా, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయినందు వల్లా, పరుగులు పెడుతూ పోతున్నందువల్లా… ఏర్పడే నష్టాలు, వచ్చే కష్టాలూ కూడా ఈ మన జీవితంలో అనుభవించవలసినవే. సాధించినంతసేపూ అంతా బానే ఉంటుంది. ఒంటరిగా, దిగాలుగా, శూన్యంగా కూర్చున్నప్పుడే క్షణం ఎంత ముఖ్యమో స్ఫురణకు వస్తుంది.
క్షణం నిర్వీర్యం కాకూడదు… క్షణం ఓవర్‌లుక్ చేయబడకూడదు.. క్షణం ఏదోలా గడిపేయబడకూడదు… క్షణకాలంలో ఎదుటి వ్యక్తి కళ్లల్లో కన్పించే ఆప్యాయత మెమరీలో నుండి చెరిపేయబడకూడదు..
ప్రేమైనా, అభిమానమైనా, ఆత్మీయతైనా full extent ఆ ఒక్క క్షణంలోనే మనల్ని మైమరిపింపజేస్తాయి… ఆ క్షణపు అనుభూతి మెల్లగా డైల్యూట్ అయిన మరుక్షణం లాజిక్ ఆ అనుభూతిని ఎనలైజ్ చేయడం మొదలెడుతుంది. లాజిక్‌నీ, ఆ క్షణిక అనుభూతుల్నీ వేరుచేసి ఆస్వాదించే నేర్పు కొరవడినప్పుడు జీవితం చప్పగా ఉంటుంది.
అందుకే క్షణాలతో జీవితాల్ని నిర్మించుకోవాలి తప్ప… ప్రతీ క్షణాన్నీ, ఆ క్షణపు ఆలోచనల్నీ, మానసిక స్థితినీ ఓ కంట కనిపెడుతూ సాగుతుండాలి తప్ప… మనది కాని జీవితాన్ని ఏదోలా బ్రతికేస్తూ పోతున్నట్లు క్షణాల్ని గంటలుగా, రోజులుగా, సంవత్సరాలుగా మార్చేసి ముగించేసేది కాదు జీవితం.
గమనిక: ఇది ఎవరికైనా ఆలోచన రేకెత్తిస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
Comments
Post a Comment