దేవీకొట్టం అనే పట్టణంలో దేవశర్మ అనే ఒక యువకుడు వుండేవాడు. పేదవాడు. ఎవరైనా పర్వదినాలలో భోజనాలకు పిలిస్తే వెళ్లి, వాళ్ళు యిచ్చిన కొద్దిపాటి వస్తువులో, డబ్బో తీసుకుని కాలం వెళ్ళదీస్తూ వుండేవాడు.
అలాగే, ఒకనాడు ఒక సంపన్నగృహస్థు యింటికి ఆ యువకుడు భోజనానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మానందమైన విందు ఆరగించి, పీకలవరకు పరమాన్నం త్రాగాడు. పొట్టనిండా గారెలు తిన్నాడు. భుక్తాయాసంతో ఆపసోపాలు పడుతున్నాడు.
ఆ తరువాత, ఆ ఇంటివారు యిచ్చిన పేలపిండిని ఒక మట్టికడవలో పోసుకుని, వారు ఇచ్చిన కొద్దిపాటి ధనాన్ని కూడా తీసుకుని యింటి దారిపట్టాడు. కొంతదూరం వచ్చేసరికి భుక్తాయాసం వలన, యెండ యెక్కువగా వున్నందువలన, ప్రయాణం కొనసాగించలేమని భావించి, యెక్కడ విశ్రమిద్దామా అని అటూ యిటూ చూశాడు. దగ్గరలో ఒక కుమ్మరివాని యిల్లు కనబడింది. అక్కడ విశ్రమిద్దామని తలచి వారి ఇంటికి వెళ్లి అడిగాడు.
ఆయన పరిస్థితి అర్ధం చేసుకున్న కుమ్మరి, అక్కడ విశ్రమించడానికి యేర్పాటు చేశాడు. అలసిపోయివున్న ఆయన, వెంటనే, తనతో వున్న పేలపిండిని కాళ్లదగ్గర పెట్టుకుని, కుమ్మరి అప్పుడే చేసిన పచ్చికుండల మధ్యలోనే, చల్లగా వుంటుందని విశ్రమించాడు.
ఎప్పుడైతే శరీరం సుఖాసనం వేసిందో, ఆయువకుడికి ఆలోచనలు మొదలయ్యాయి. తన భవిష్యత్తును యెంతో అందంగా వూహించుకుంటూ, ' ఈ పేలపిండి అమ్మగా వచ్చే డబ్బుతో ఒక పాడి ఆవును కొంటాను. దానితో పాలవ్యాపారం చేస్తాను. అది కొన్ని దూడలను కంటుంది. వాటిని కూడా అధిక ధరకు అమ్ముతాను. ఒక ప్రక్క పాల వ్యాపారం, ఇంకో పక్క దూడల వ్యాపారం తో బాగా సంపాదిస్తాను. ధనవంతుడిని అవుతాను. మేడకొంటాను. అందమైన భార్యను తెచ్చుకుంటాను. అన్ని సౌకర్యాలతో దాస దాసీ జనాలతో యిల్లు కళకళలాడుతుంటుంది. నా భార్య పిల్లలని క్రమశిక్షణగా పెంచక పొతే, లాగి యిలా త౦తాను ' .అనుకుంటూ ఆవేశంగా, అక్కడ భార్యను ఊహించుకుని, నిద్రలోనే, ఒక్క తన్ను తన్నాడు.
అంతే ! నిజంగానే తాను తన్నినతన్నుతో కాళ్ళ దగ్గర వున్న తన పేలపిండి కుండ, యేదైతే యీ వూహలకు మూలకారణం అయిందో అది, భళ్ళున పగిలి పేలపిండి అంతా నేలపాలైంది. కుమ్మరి చుటూ పేర్చుకున్న కుండలు కూడా పగిలిపోయాయి. ఇంకేముంది ఆ యువకుడి ఆశలన్నీ అడియాసలు అయ్యాయి.
చేతిలోవున్న కొద్దిపాటి ధనం కూడా కుమ్మరికి సమర్పించుకోవాల్సి వచ్చింది ఆ పగిలిపోయిన కుండల నిమిత్తం.
చూశారా ! జీవితం లో పైకి రావాలనుకోవడం తప్పుకాదు. కలలు కనడమూ తప్పుకాదు. అయితే వున్న పరిసరాలు మర్చిపోయి విపరీత ఆలోచనలు యెవరికీ పనికిరావు కదా ! పగటికలలని వాటినే అంటారు. అదే జరిగింది పాపం యీ యువకుని విషయంలో.
Comments
Post a Comment