అనగనగా ఒక తండ్రి. ఆయనకు ముగ్గురు పిల్లలు. ముగ్గురూ చాలా తెలివైన వాళ్లు.
కొన్నాళ్లకు తండ్రి చనిపోయాడు. బ్రతుకు తెరువు వెతుక్కుంటూ బయలుదేరారు ముగ్గురూ.
దారిలో వాళ్లకు ఒక పెద్ద మనిషి ఎదురయ్యాడు. 'నా గుర్రం తప్పిపోయింది. మీకేమయినా కనబడిందా?' అని ఆ పెద్ద మనిషి అడిగాడు.
'ఈ దారినే పోయింది' అన్నాడు మొదటి వాడు.
'దాని కుడి కన్ను గుడ్డిదా?!' అన్నాడు రెండోవాడు.
'దాని మీద ఒక పిల్లవాడు ఉన్నాడు కదా?!' అన్నాడు మూడవ వాడు. ఆ పెద్ద మనిషి ఎంతో సంతోషపడ్డాడు.
'అంతా సరిపోయింది- మీరు ఎక్కడ చూసారు దాన్ని?!' అని అడిగాడు.
'మేము దాన్ని చూడలేదు' అన్నారు అన్నదమ్ములు.
'అవునా?! మరి చూడకుండా ఇవన్నీ ఎలా చెప్పారు?!' అన్నాడు పెద్ద మనిషి , కొంచెం అనుమానంగా.
'మా తెలివి తేటలతో చెప్పాం' అన్నారు అన్నదమ్ములు.
'చూడకుండా తెలివితేటలతో ఇదంతా ఎలా చెప్పగలరు, ఎవరైనా? మీరే నా గుర్రాన్ని దొంగలించారు! పదండి, రాజు దగ్గరకు! అన్నాడు పెద్ద మనిషి.
అందరూ రాజు దగ్గరికి పోయారు.
'అసలు గుర్రాన్నే చూడకుండా దాని గురించి అన్ని వివరాలు ఎలా చెప్పారు? అని రాజు కూడా అడిగాడు.
'మా తెలివి తేటలను ఉపయోగించి చెప్పాం' అన్నారు వాళ్ళు.
'అదే అడుగుతున్నది. ఆ తెలివి తేటలకు ఏమిటి ఆధారం?' అడిగాడు రాజు.
'అడుగు జాడలను బట్టి గుర్రం ఆ దారినే పోయిందని చెప్పాను' అన్నాడు మొదటి వాడు.
'బాట వెంబడి పెరుగుతున్న గడ్డిపోచల్ని గమనించాను. బాటకు ఎడమ ప్రక్కన ఉండే గడ్డి పరకలు మేసి ఉన్నాయి, కుడి ప్రక్కవి మేయలేదు. అట్లా తెల్సింది- అది గుడ్డిదని. దాని కుడి కన్ను పనిచేయట్లేదు' అన్నాడు రెండోవాడు.
'మేం వచ్చే దారిలో ఒక మడుగు ఎదురైంది. ఆ మడుగు దగ్గర గుర్రం అడుగులు, పిల్లవాడి అడుగులు కనబడ్డాయి మాకు. వాళ్లు దాంట్లో నీళ్లు తాగినట్లున్నారు. దాన్ని బట్టి గుర్రం మీద పిల్లవాడు ఉన్నాడని తెలుసుకున్నాను' అన్నాడు మూడోవాడు. రాజుగారు వీళ్ల తెలివికి విస్తుపోయాడు. అయినా 'పరీక్షించాలి' అనుకున్నాడు. భటులకు ఏదో చెప్పాడు. వాళ్ళు ఒక పెట్టె మోసుకొని వచ్చారు. 'ఈ పెట్టెలో ఏముందో చెప్పండి. అప్పుడు గానీ మీ మాటలు నమ్మను' అన్నాడు రాజు.
'ఇందులో తేలికైన వస్తువులు ఉన్నాయి!' అన్నాడు మొదటివాడు.
'అవి గుండ్రని వస్తువులు!' అన్నాడు రెండోవాడు.
'అవి మామిడి కాయలు!' అన్నాడు మూడోవాడు.
"నిజమే ప్రభూ! వీళ్ళు సరిగా కనుక్కున్నారు!" అన్నారు భటులు, పెట్టె మూత తెరిచి చూపిస్తూ.
'ఇదెట్లా చెప్పగలిగారు?' అడిగాడు రాజు, ఆసక్తిగా.
'ఇద్దరు భటులు ఆ పెట్టెను అలవోకగా తీసుకొచ్చారు. వాళ్ళు మోసే తీరును బట్టి అందులో తేలికైన వస్తువులు ఉన్నాయని తెలిసింది' అన్నాడు మొదటివాడు.
'పెట్టెలో వస్తువులు దొర్లిన శబ్దం వినబడింది. అవి దొర్లినప్పుడు పెట్టె వంకర తిరగటమూ, భటులు దాన్ని సవరించటమూ చూసాను. అట్లా అవి గుండ్రనివని చెప్పాను' అన్నాడు రెండోవాడు.
'భటులు పెట్టెను తూర్పు వాకిలి నుండి తెచ్చారు. భవంతికి అటువైపున మామిడి తోపు కనిపిస్తూనే ఉంది. అదీగాక ఈకాలంలో కాచేది మామిడి కాయలే కదా; దీన్ని బట్టి చెప్పాను అవి మామిడి కాయలని!' అన్నాడు మూడోవాడు.
'బలే గమనిస్తారు మీరు! లోకాన్ని చూడటం ఎలాగో మీనుండే నేర్చుకోవాలి' అని రాజు వాళ్లను మెచ్చుకున్నాడు. వాళ్ళకు లెక్కలేనన్ని కానుకలిచ్చి, తన కొలువులోనే సలహాదారులుగా ఉంచుకున్నాడు.
Comments
Post a Comment