మనిషి గమ్యం చేరతాడు, ఒక లక్ష్యం ఉన్నప్పుడు. లక్ష్యం ఏర్పరచుకుంటాడు, సంకల్పం దృఢమైనప్పుడు. సంకల్పించుకుంటాడు, మంచి ఆలోచన రూపుదిద్దుకున్నప్పుడు. వీటన్నింటికీ మూలం ధర్మం. అది మనసులో పుట్టే కోరికలన్నింటికీ నిజమైన స్నేహితుడి వంటిది. తత్వోపదేశంలో గురువు వంటిది. యుద్ధరంగాన సైనికుడి వంటిది. ధనార్జనలో మంత్రి వంటిది. పోషణలో తల్లి వంటిది. ప్రయాణంలో తండ్రి వంటిది. చతుర్విధ పురుషార్థాల్లో ధర్మానిదే ప్రథమస్థానం. పోయేటప్పుడు మనిషి వెంట వచ్చేది ధర్మం ఒక్కటే!
మనిషిలో ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, శాంతం, కార్యదీక్ష, సహనం తగ్గాయీ అంటే- అతడు ధర్మాన్ని విస్మరిస్తున్నాడన్న మాట. ధర్మం ఒక్కటే అతడికి అపూర్వమైన శక్తినిస్తుంది. అద్భుతమైన సంతృప్తి కలిగిస్తుంది.
ఐహికమైన ఆనందాలు, సరదాలు చాలా ఉంటాయి. అవేమీ శాశ్వతాలు కావు. దైహిక వాంఛల వలలో పడితే, మనిషి అదే లోకమనుకుంటాడు. బావిలో కప్పలా మారతాడు. నశ్వర భోగభాగ్యాల్లో కొట్టుమిట్టాడుతుంటాడు. తన జీవితానికి అసలు కావాల్సిందేమిటి, ఎటు వెళ్లాలి, ఎలా వెళ్లాలి? ఈ ప్రశ్నలే ఉదయించవు అజ్ఞాని మనసులో! అటువంటి మనసు- తెగిన గాలిపటం. ఆకులు కప్పి ఉండే వూబి. వివేకం కొరవడినప్పుడు, మనసే మనిషిని సుడిగుండంలో పడేస్తుంది.
హృదయ దౌర్బల్యాన్ని పిరికితనాన్ని విడిచి, కర్తవ్యం నిర్వహించేందుకు ముందుకు నడవాలని ‘సాంఖ్యయోగం’లో అర్జునుడికి గీతాచార్యుడు చెబుతాడు. ఆ ‘గీత’ నుంచి ప్రేరణ పొందిన జాతిపిత బాపూజీ ఓ సందర్భంలో- ‘నన్ను దైన్యం, నిరాశ, నిస్సత్తువ ఆవరించినప్పుడు గీతాపారాయణం చేస్తాను. గీతలోని ప్రతి శ్లోకమూ నాకు పోరాడే శక్తినిస్తుంది’ అన్నారు.
సీతకు దూరమైన స్థితిలో శ్రీరాముడు ఆత్మస్థైర్యంతో వ్యవహరించి, తన ధర్మనిర్వహణ చేశాడని వాల్మీకి ప్రశంసించాడు. అశోకవనంలో తల్లడిల్లిన సీతాదేవికి త్రిజట మాటలు, రామదూతగా హనుమ ఇచ్చిన ఆనవాలు ఎంతో ధైర్యమిస్తాయి. కష్టాలకు విసిగిపోని మనిషే ఎప్పటికైనా విజయం పొందగలడన్నది అక్షరసత్యమని హనుమతో ఆమె అంటుంది.
లక్షలాది జీవరాశుల్లో దేనికీ లేని బుద్ధిని, మనసును మనిషికి భగవంతుడు ప్రసాదించాడు. ఆ బుద్ధి చేసే మార్గనిర్దేశనాన్ని మనసు అనుసరిస్తే చాలు- మనిషిని మించిన శక్తిమంతుడు ఉండడు. అతడు సర్వ శక్తిమంతుడన్నది యథార్థం. ధర్మం, కరుణ, సత్యం, ప్రేమ, అహింస, ధైర్యం తోడున్నంతవరకు అతడు సాధించలేని విజయమంటూ ఉండదు. ఎక్కలేని శిఖరమంటూ ఉండదు. ఎందరో ఇది వాస్తవమని నిరూపించారు. అనాదిగా వస్తున్న ఈ ఆర్షవాణిని ఆచరించడమే మనిషికి మంచి మార్గం చూపుతుంది. వృత్తిని దైవంగా, ప్రవృత్తిని ధర్మంగా భావించి ముందుకు సాగినప్పుడు- మనిషికి పరాజయమే ఉండదు, శత్రువులు ఉండరు. జ్ఞానం, దానం, శీలం అనే గుణాలు అతడికి అంగరక్షకుల్లా ఉంటాయి.
మనిషిని చెడగొట్టేవి నాలుగు. అవి ‘నేను, నాది, నువ్వు, నీది’ అనే మాటలు. వాటికి మనసులో స్థానం ఇవ్వనంత వరకు, అతడు అజేయుడే! ఆధ్యాత్మిక నిబద్ధత లేని జీవితం- కవచం లేకుండా యుద్ధమైదానంలో నిలుచునే సైనికుడి లాంటిది. కోరికల్ని తగ్గించుకున్న కొద్దీ మానవుడికి నిబద్ధత పెరుగుతుంది. అదే అతడికి విజయకేతనం అందిస్తుంది. మనిషి సమాజంలో జీవిస్తున్నాడు. రుషులు ఒంటరిగా అడవుల్లో కూర్చుని సామాజిక శ్రేయస్సు కోసం తపస్సు చేశారు. సమాజం మధ్యనే బతుకుతుండే వ్యక్తి ప్రతి వస్తువుకూ ఇతరుల మీద ఆధారపడుతున్నాడు. ఆ కృతజ్ఞత అతడికి ఉండాలి. అప్పుడే ప్రేమ అంకురించి మహావృక్షమై విశ్వానికి సత్ఫలాలు ఇవ్వగలుగుతుంది. మనిషి జన్మ సార్థకమవుతుంది.
చేస్తున్న కొద్దీ పెరిగేది ధర్మం. ఇస్తున్న కొద్దీ పెరిగేది దానం. ఈ రెండూ మనిషి చేసే జీవనపోరాటంలో, అతడికి లభించిన దివ్యాస్త్రాలు. అప్పుడు మనిషి ఒంటరివాడు కాడు. అసహాయుడు అసలే కాడు. అనాథ అంతకన్నా కాడు. అతడికి ఎవరూ తోడు ఉండాల్సిన అవసరమూ లేదు. అతడే ఒక సైన్యం!
👌🙏🙏🙏
ReplyDelete