ఈ జీవితం ఎందుకొచ్చిందో తెలియదు నుంచి ఎందుకొచ్చిందో తెలుసుకోవడం వరకు చేసే ప్రయాణమే జీవితం. జ్ఞానపరంగా జీవనం గురించి జీవితం బోలెడంత సమాచారం ఇస్తూనే ఉంటుంది. జీవించడంలోనే జీవితం చాలా విషయాలు నేర్పిస్తుంది. నేర్చుకోను అని భీష్మించుక్కూర్చున్న మనిషికి సైతం అన్ని వైపుల నుంచీ జ్ఞానం చేరువవుతూనే ఉంటుంది. జీవితం నేర్పిస్తూనే ఉంటుంది. జీవితంలో ఇటువంటి ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. అయితే జీవితానికి ఎందుకింత ప్రయాస... నా బాధేదో నన్ను పడనివ్వొచ్చు కదా అని మనిషికి అనిపిస్తుంది. అయినా జీవితం వదలదు. గొప్ప నైపుణ్యం కలిగిన దర్శకుడిలా నాటకీయంగా మనల్ని బతుకు సంఘటనల్లో (అనుభవాల్లో) ఇరికించి మన ప్రజ్ఞ చూస్తుంది. ఎందుకంటే, అలజడిలోనే మనిషి బయటపడతాడు అని దానికి బాగా తెలుసు. జీవితం మంచి చెప్పదు. అలాగని చెడూ చెప్పదు. రెండింటినీ మనకు చూపిస్తుంది. మన ముందుంచుతుంది. ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టం అంటుంది. భగవద్గీతలా సాక్షిగా ఉండి నిశ్చలంగా చూపిస్తుంది.
జీవితమనే నదిలో దిగిపోయాం. ఈదాలి. నది మధ్యలో మార్పులు జరగవు. ఎదురీత కుదరదు. ప్రవాహపు దిశలో నదితో పాటు సాగాలి. వ్యతిరేక దిశలో ప్రయాణం చెయ్యలేం. వ్యతిరేకంగా వెళ్లడానికి జీవితం ఒప్పుకోదు. ఎలాగోలా మన వంపులు సరిచేసి, అరగదీసి ముందుకు తీసుకుపోతుంది.
జీవితానికి ఎందుకింత పట్టుదల అని ఒక్కోసారి మనకు అనిపిస్తుంది. మనకూ పట్టుదల పెరుగుతుంది. జీవితాన్ని గట్టి దెబ్బ తీయాలనుకుంటాం. నువ్వు తప్పు అని రుజువు చెయ్యాలనుకుంటాం. చేయబోతాం. అది చుట్టూ తిరిగి మనకే వచ్చి తగులుతుంది. ఎన్ని తప్పుటడుగులు వేసినా జీవితమే నిజం అని చివరికి తేలుతుంది. నిస్సహాయంగా రాజీపడతాం. నమ్మకమైన స్నేహితుడి భుజమ్మీద చెయ్యివేసి నడిచినట్లు జీవితంతో కలిసి నడుస్తాం. జీవితం నవ్వుకుంటుంది. నిండుగా ఆశీర్వదిస్తుంది.
అయినా వేదాంతుల్లా జీవితం మీద వ్యాఖ్యానాలు చేస్తాం. జ్ఞానుల్లా జీవితాన్ని మాయగా సంబోధిస్తాం (విశ్లేషిస్తాం). పండితుల్లా జీవితానికి వ్యాకరణం బాగులేదని సరిచెయ్యబోతాం. లోపల నీలగిరి చెట్టులా పెరిగిపోయిన అహం మీద కూర్చుని ‘నేను’ అనే భావంతో జీవితాన్ని గడ్డిపోచలా చూస్తాం. జీవితం భయపడదు. కనీసం పట్టించుకోదు. ఎన్నో తుపానులు చూసిన సముద్రంలా గంభీరంగా ఉంటుంది. ‘తామరాకు మీద నీటి బొట్టులా జీవిస్తే నువ్వు సుఖపడతావు. లేదంటే వాన కురిసి వెళ్లిపోయిన మేఘంలా ఆకాశంలో నీ గుర్తులూ మిగుల్చుకోలేవు’ అంటుంది.
జీవితం నీది, నాది కాదు. మనందరిదీ. చరాచర ప్రకృతికి జీవితం ఉంది. అందులో మనం ఉన్నాం. వంగి, తల వంచి, మనసు తెరిచి మన జీవితం మనకు ఏం నేర్పిస్తుందో, ఏం తెలియజేస్తోందో తెలుసుకోవాలి. మనమే మన అంతరంగం తలుపు తెరవాలి. అప్పుడు అసలైన అనంతమైన దివ్య జీవితం గురించి తెలుస్తుంది. వినయంతో, ప్రేమతో, సేవాభావంతో శరణాగతి చెందితే జీవితమే మనకు గురువని అర్థమవుతుంది. సత్యం తెలియజెయ్యడానికి జీవితం మన వెంటపడిందని, సత్యమే మన లక్ష్యమని బోధపడుతుంది. జీవితం గొప్పదనం తెలుస్తుంది!
Comments
Post a Comment