ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వస్తాం.. వచ్చాక చిన్నప్పుడు ఎవరో ఆడిస్తుంటారు.. అమ్మా.. నాన్నా.. తమ్ముడు, అక్కా, మామయ్య.. రకరకాల పిలుపులు అలవాటు చేస్తారు. ఎదిగే కొద్దీ బంధాలు బలపడతాయి.
ప్రతీ బంధానికీ ఓ పరిధి ఉంటుంది.. అంతకన్నా చొచ్చుకుని వెళ్లలేదు. ఎవరికి వాళ్లకి కుటుంబాలు ఏర్పడ్డాక ఆ అగాధాలు మరింత పెరిగిపోతాయి కూడా! చివరకు భార్యా భర్తల మధ్య కూడా ఓ అగ్రిమెంట్ లాంటి రిలేషన్ మాత్రమే జీవితాంతం కొనసాగే దుస్థితి. మనిద్దరం కలిసి ఉండాలి కాబట్టి.. "నువ్విలా ఉండు, నేనిలా ఉంటాను, నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రాకు.. నీకు ఆ విషయం కోపం కాబట్టి నేను ప్రస్తావించను, నా ఈ విషయం నచ్చదు కాబట్టి నువ్వు దాని గురించి మాట్లాడకు" ఇలా కొన్ని రహస్యపు హద్దులు ఏర్పడతాయి. సమాజంలో 95 శాతం జీవితాలు ఇలా సర్ధుబాట్ల మధ్యనే కొనసాగుతాయి.
కానీ వీటన్నింటికీ అతీతమైన ప్రేమ ఉంటుంది.. ఏ బాహ్య విషయాలూ ఆ ఇద్దరి మధ్యా అగాధాన్ని ఏర్పరచలేనివి. ఒకరినొకరు జడ్జ్ చేసుకోని పరిపక్వతతో కూడిన ప్రేమ. చనువు పేరిట.. "ఏదో పెద్ద చెప్పొచ్చావులే.." అని కూడా తమ భాగస్వామితో నిష్టూరంగా మాట్లాడడం రాని స్వచ్ఛత. ప్రేమంటే.. అదీ ఇదీ అని ఎవరికి తోచిన డెఫినిషన్లు వాళ్లు ఇచ్చేస్తూ ఉంటారు... ఇదో కండిషనింగ్. మరో డెఫినిషన్ ఇక్కడ నేను ఇవ్వడం సమంజసం కాదు గానీ.. ప్రేమ అనే రిఫరెన్స్ పాయింట్‌కి సంబంధించినదో కాదో తెలీదు.. బట్ ఒక్కటి నిజం.. చుట్టూ ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎన్ని భౌతిక విషయాలు ఉన్నా ఇద్దరి హృదయాలు కలిసిపోయి ఒకటే ఫ్రీక్వెన్సీలో ముందుకు సాగితే అదో అలౌకిక స్థితి.
ఇద్దరిలో ఏ రిజెక్షన్ లేని స్థితీ.. ఒకరి వైపు మరొకరు ప్రవహించే స్థితీ.. రెండు కాన్షియస్‌నెస్‌ల మధ్య పెనవేసుకునే ఓ బంధం.. ఇలాంటిది ప్రపంచంలో కోటికి కొద్దిమందికి ప్రాప్తిస్తుందేమో! "నేను నా భర్త పట్లా, భార్య పట్లా, ప్రేయసి పట్లా, ప్రియుడి పట్లా ఇలా ఉండాలి" అని నిశ్చితాభిప్రాయాలతో సాగించే ప్రయాణం కాకుండా.. ఎలాంటి సరిహద్దులూ, ఎలాంటి కండిషనింగ్‌లూ లేకుండా స్వేచ్ఛగా, హృద్యంగా పెనవేసుకుపోయే బంధం.
ఎమోషన్లతో మైకం కమ్మేసే స్థితి కాకుండా.. స్థిరంగా, స్థిమితంగా, ధైర్యంగా, ధీమాగా, ప్రశాంతంగా, పరిపూర్ణంగా సాగే ఇరువురి ఒకే ఆలోచన! రెండు ఆలోచనలేవీ ఉండవు.. ఉండేది ఒకటే.. ఒకరి స్పందన మరొకరి నుండి వచ్చే స్థితి.
ఇలాంటివి చాలామందికి అనుభూతి లేకపోవడం వల్ల.. "కధల్లో, కవితల్లో, ఇలా వ్యాసాల్లో రాసుకోవడానికి బావుంటాయి.. ఇలా ఎక్కడ జరుగుతుంది.." అనే నిట్టూర్పులు సహజంగానే విన్పిస్తాయి. కానీ ఈ ప్రపంచానికి తెలియనిది.. ప్రవాహంలో కొట్టుకుపోయే జీవితాల్లో అక్కడక్కడా.. ఇలా కొన్ని ప్రాణాలు నిండుగా పరిమళిస్తుంటాయి.. ఆ హృదయాల మధ్య హార్మొనీ.. రణగొణ ధ్వనుల మధ్య ఎరుకకు రాకుండా కొట్టుకుపోతుందని!!
అనుబంధమంటే.. ఒక ట్యాగ్‌లైన్‌తో డిఫైన్ చెయ్యబడేది కాదు.. ప్రేమంటే ఒక నాలుగు పదాల్లో అల్లేసి నిర్వచించబడేది కాదు.. ఆవిష్కృతం కాని ఎన్నో కోణాలు నిండైన హృదయాల చుట్టూ పెనవేసుకుపోయి ఉంటాయి.
Comments
Post a Comment