✳సముద్రపు తీరానో లేక ఒక సరస్సు పక్కన ఉన్న ఇసుకను చేతితో తోడుతూ పోతే కొంతలోతులో నీరు లభిస్తుంది. ఆ నీరే భూగర్భ జలం. నేలపై బావి తవ్వితే అందులో ఊరే నీరు భూగర్భ జలం. భూమిపై కురిసిన వర్షపునీరు, మంచు, వడగళ్లవాన వల్ల ఏర్పడిన నీరు గురత్వాకర్షణ వల్ల నేలపై ఉండే మన్ను, ఇసుక, గులకరాళ్ల పొరలగుండా భూమిలోకి ప్రవేశించి అక్కడ ఉండే రాతి పొరల్లో పయనించి కొంత లోతులో నిక్షిప్తమవుతుంది. సరస్సులలో నదుల్లో, సముద్రాల్లో లభించే నీరు ఉపరితలపు నీరు (surface water). ఉపరితలపు నీరు, భూగర్భ జలాలు వాటి స్థలాలను మార్చుకుంటాయి. భూగర్భ జలాలు భూమిలోని పొరల గుండా సరస్సుల్లోకి, కాలువల్లోకి ప్రవేశింవచ్చు. అలాగే సరస్సుల్లోని నీరు పక్కనే ఉన్న భూభాగంలోకి 'లీకై' భూగర్భ జలంగా మారవచ్చు.
భూగర్భ జలాలను తనలో ఇముడ్చుకొనే ప్రక్రియలో భూమి ఒక పెద్ద స్పాంజిలాంటి పాత్రను పోషిస్తుంది. భూగర్భ జలాన్ని బావులు తవ్వడం ద్వారా, బోరు పంపులు వెయ్యడం ద్వారా భూమిపైకి తీసుకొని వచ్చి, ఆ నీటిని తాగునీటిగా, సేద్యపు నీరుగా వాడుకుంటాం. ఆ విధంగా భూగర్భజలం మానవులకు ప్రకృతి ప్రసాదించిన ఒక బ్యాంక్ ఎకౌంట్ లాంటిది.
భూగర్భజలాలు చాలావరకు స్వచ్ఛంగానే ఉంటాయి. ఎటొచ్చి భూమి లోపల నిర్మించిన ఆయిల్ టాంకర్లు లీక్ అయితేనే, పంటపొలాలకు అవసరానికి మించి రసాయనిక ఎరువులు వేయడం వల్లో ఆ కాలుష్యాలు భూగర్భ జలాలను కలుషితం చేసే ప్రమాదం ఉంది.
Comments
Post a Comment