విలువలు అని కొన్ని ఉంటాయి.. అవి చిన్నప్పటి నుండి సుమతీ శతకాల్లో గానీ, మన తల్లిదండ్రులు, గురువుల ద్వారా గానీ చెప్పబడుతూ ఉంటాయి.
"ఎవరి గురించీ చెడు మాట్లాడకు" - అనేది ఓ విలువ. శుభ్రంగా స్నానం చేసి దేవుడి గుడికెళ్లి కళ్లు మూసుకుని ఈశ్వరుడిని, రాముడిని, వేంకటేశ్వరుడిని, లేదా ఏసునీ, అల్లానీ ప్రార్థించేటప్పుడు "నా పాపాలు పరిహరించు దేవా" అని వేడుకుంటాం. నేను బుద్ధిగా నడుచుకుంటాను అని మనస్సులో సంకల్పం చెప్పుకుంటాం. అంటే మనం విలువలకి కట్టుబడతాం అని దేవుడి ముందు కమిట్ అవుతున్నామన్నమాట. దేవుడి ముందు అంతగా కమిట్ అయిన మనం దాన్ని త్రికరణశుద్ధిగా అనుసరించాలి. లేదంటే మన భక్తి, దేవుడు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నట్లే కదా?
చంద్రబాబు సతీమణిని ఎవరో ఏదో అన్నారు. - అది తప్పా కాదా? ఫస్ట్ హృదయం లెవల్‌లో ప్రతీ వ్యక్తీ ఈ క్లారిటీ తెచ్చుకోవాలి.
కానీ "ఎవరి గురించీ చెడు మాట్లాడకు" అనే మూల సిద్ధాంతాన్ని నమ్మే మనం, దేవుడి దగ్గర "నేను ఎవరికీ హాని చెయ్యను" అని ప్రార్థనలు చేసే మనం.. వెంటనే ఇలా అన్నాం.
"మోడీని వాళ్లు అన్నారు కదా..
"లేదా జగన్ కుటుంబ సభ్యులను వీళ్లన్నారు కదా.. తన దాకా వస్తే అనుభవించాలి" అని!
మళ్లీ విలువల దగ్గరకు వస్తాను.. "తనదాకా వస్తే అనుభవించాలి.." ఇది విలువా, మనం పెట్టే శాపమా? శాపాలు పెట్టడానికి మనం విలువలు నేర్చుకున్నామా?
మోడీని అన్నప్పుడూ, జగన్ కుటుంబాన్ని అన్నప్పుడూ అది తప్పే. తప్పు ఎప్పటికీ తప్పే. అదీ మనం ఖండించాలి. ఇదీ ఖండించాలి. అది జరిగింది కాబట్టి ఇది కరెక్టే అనేది ఏ తరహా దృక్పధం? రేపు మళ్లీ ఇంకొకరు ఇంకొకర్ని ఏదో అంటారు.. "వీళ్లు అలా చేశారు కాబట్టి ఇలా ప్రవర్తించడం కరెక్టే" అని సమర్థిస్తారా?
ఒకదాన్ని మరో దానితో ముడిపెట్టి, చివరకు ప్రతీదీ చర్యా, ప్రతిచర్యా, కక్షకార్పణ్యంగా భావించే సంకుచితత్వం మన దేవుడు, మన మతాలు, మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న విలువలూ మనకు ఇచ్చాయా?
ఇలా నాబోటి వాడు వివరంగా మన వ్యక్తిత్వంలోని లోపాలను అగ్నితో కడిగేలా ఎవరైనా రాశాడు అనుకోండి.. "ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు, అప్పుడు మోదీని అన్నప్పుడు ఏమైయ్యారు" అంటూ మళ్లీ మూర్ఖత్వం మొదళ్లకి వెళ్లిపోతారు. మోదీని అనడమూ తప్పేననీ, జగన్‌ని అనడమూ తప్పేనని, నిన్ను అనడమూ తప్పేననీ, అసలు తప్పు అనేది ఎప్పటికీ తప్పేనని ఎంతమంది ఎంతమందని వివరణ ఇవ్వాలి? "నేను అప్పుడూ అది తప్పే అని రాశాను" అని కాస్త విశాలంగా ఆలోచించే వాడు తన టైమ్‌లైన్ మొత్తం గాలించి ఆ పోస్ట్ దొరక్క ఈ మూర్ఖుడికి సమాధానం చెప్పలేక, వీళ్ల బ్రతుకు ఇంతే అని ఊరకుండిపోవాలా? దాన్ని చూసి "చూశారా, ఆయన సమాధానం చెప్పలేకపోయాడు" అని మళ్లీ వీళ్లు విర్రవీగిపోవడమూ! సరే వ్యక్తిగతంగా నేను స్వయంగా సాక్షి టివిలో కూర్చుని "వైయస్ షర్మిల మీద పుకార్లు వచ్చినప్పుడు తీవ్రంగా ఖండించాను. తప్పుని తప్పు అని ఖండించే సంస్కారం మాబోటి వాళ్లకి ఉంటుంది. మూర్ఖత్వం హద్దులు మీరితే పైశాచికత్వం అవుతుంది. దాని ఛాయిలు ఇప్పుడు సమాజంలో కన్పిస్తున్నాయి.
మనం మనుషులమైతే మోదీని, జగన్‌నీ, చంద్రబాబునీ, నిన్నూ, నన్నూ, ఎవరేమన్నా అది తప్పే అనే సంస్కారం అలవరుచుకోవాలి మొదట. దానికి ప్రతీ వ్యక్తినీ నిదర్శనాలు చూపించమనే సంకుచిత భావాలు పోవాలి! కాటికి కాళ్లు చాపే ముసలమ్మలు "అప్పుడు వాడు అలా చేశాడు, నా శాపం తగిలిపోనూ" అంటూ ఊరికే సణుక్కుంటూ ఉంటారు. అలాంటి ముసలమ్మలకీ మనకీ తేడా లేదా? ఈరోజు జరిగిన సంఘటన గురించి ఖండించే సంస్కారం పోగొట్టుకుని "అప్పుడలా జరిగిందని" సణుగుళ్లు పెట్టే మనకు!
ఇంకొకడు అంటాడు.. కాస్త ఆధ్యాత్మిక భావనలు ఉన్నవాడు "కర్మ సిద్ధాంతం తన పని తాను చేసుకుపోతుంది" అని! సరేలే నాయనా.. కర్మ సిద్ధాంతం ఎటూ తన పని తాను చేసుకుపోతుంది, నువ్వు నీ సంకుచిత్వంతో ఆ కర్మల్లో ఇరుక్కుపోయి దుష్కర్నలు పెంచుకోకు. అదే కర్మ సిద్ధాంతం నువ్వు చేస్తున్న ఈ కర్మకీ ప్రతిచర్య చూపించకపోదు.
"అరే మనుషుల్లారా మనం దేవుళ్లం మనలో ప్రేమ అనేది మిగిలి ఉంటే, ఇలాగే రాక్షసత్యం కొనసాగిస్తే ఆ రాక్షసత్వం నీ హృదయాన్ని నిరంతరం కాల్చేస్తూనే ఉంటుంది. మనిషిగా తప్పుని తప్పు అని ఖండించే సంస్కారం నేర్చుకో!
చివరిగా ఓ సీక్రెట్ చెబుతా.. జీవితాంతం గుర్తు పెట్టుకో.. శాపాలు పెట్టే వాళ్ల శక్తి హరించుకుపోతుంది. వాళ్లు నిరంతరం ఎమోషన్స్‌లో కొట్టుకుపోతారు. ఆశీర్వదించే వాళ్లు నిరంతరం ప్రేమతో మునిగి తేలతారు. సో ఇప్పుడు డిసైడ్ చేసుకో, శాపాలు పెట్టి శక్తి కోల్పోతావో, ఆశీర్వదించి, మంచి మాట్లాడి ప్రేమగా ఉంటావో!
Comments
Post a Comment